పచ్చటి పంట దెబ్బతింటే రైతు కుదేలవుతాడు. పనిచేసే వయసులో రైతు మరణించినా ఆ కుటుంబానిది అదే పరిస్థితి. చిన్న, సన్నకారు రైతు ఎక్కువగా ఉండే రాష్ట్రంలో ఏ కారణంతోనైనా వారు మరణిస్తే.. ఆ కుటుంబం జీవనోపాధికీ ఇబ్బందే. ఈ దుస్థితిని తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం.. బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. 18 నుంచి 59 ఏళ్ల లోపు రైతులు ఈ పథకానికి అర్హులు కాగా.. ఇందులో నమోదైన రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవితబీమా పరిహారం ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా అందుతోంది. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఆ వయసు లోపు రైతులు 43,293 మంది కన్నుమూశారు. అంటే రోజుకు సగటున 57 మంది రైతులు మరణించారు. వీరి కుటుంబాలకు ఇప్పటివరకూ రూ.2,164.65 కోట్లను జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) పరిహారంగా అందజేసింది. ఈ పథకంతో ఆయా రైతుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందినట్లు వ్యవసాయశాఖ తాజాగా ప్రభుత్వానికిచ్చిన నివేదికలో వెల్లడించింది.
తొలి ఏడాది..
2018 ఆగస్టు 14న ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తేదీ నాటికి 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు గల 31.27 లక్షల మంది రైతులను అర్హులుగా ఈ పథకంలో నమోదుచేశారు. వీరందరికీ 2019 ఆగస్టు 13 వరకూ బీమా సదుపాయం కల్పించారు. వారి తరఫున ఒక్కొక్కరికి రూ.2,271.50 చొప్పున ప్రీమియంగా మొత్తం రూ.710.58 కోట్లను వ్యవసాయశాఖ 2018 జులైలో ఎల్‌ఐసీకి చెల్లించింది. ఆ ఏడాది మరణించిన రైతుల సంఖ్య 17,605 కావడంతో వారి కుటుంబాలకు రూ.880.25 కోట్లను పరిహారంగా అందించింది. దీంతో తమకు తొలి ఏడాది రూ.170.33 కోట్ల నష్టం వచ్చిందని, మరుసటి ఏడాది నుంచి ప్రీమియం పెంచాలని ఎల్‌ఐసీ పట్టుపట్టింది. ప్రభుత్వం ఎల్‌ఐసీతో చర్చించి 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 13 వరకూ రెండో ఏడాదికి ఒక్కో రైతు తరఫున కట్టే ప్రీమియంను రూ.3,457కు పెంచింది. లబ్ధిదారుల సంఖ్య 30.84 లక్షలకు తగ్గినప్పటికీ ప్రీమియం పెంపుతో వ్యవసాయశాఖ అంతకుముందు ఏడాది కంటే ఎక్కువగా రూ.1,065.37 కోట్లు బీమా సంస్థకు చెల్లించింది.
మూడో ఏడాది..
2020 ఆగస్టు 14 నుంచి 2021 ఆగస్టు 13 వరకూ మూడో ఏడాది పథకం అమల్లో ఉంటుంది. ఇందుకుగానూ 32.73 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.3,486.90 చొప్పున ప్రీమియంను గత ఆగస్టులో వ్యవసాయశాఖ చెల్లించింది. గత ఆగస్టు 14 నుంచి ఈ నెల 22 వరకూ 7,183 మంది రైతులు కన్నుమూశారు.