అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో రాజధాని రైతులు చేస్తున్న పోరాటం 400 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఐకాస భారీ ర్యాలీ నిర్వహించింది. 'అమరావతి సంకల్ప ర్యాలీ' పేరిట జరిగిన ఈ ర్యాలీ తుళ్లూరు నుంచి ప్రారంభమై రాజధాని గ్రామాల మీదుగా మందడం వరకూ సాగింది. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లతో రైతులు, రైతు కూలీలు, మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీకి ఘన స్వాగతం...
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, జై అమరావతి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఉద్యమ గీతాలతో రాజధాని వాసులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామాలు వచ్చినపుడు పాదయాత్ర చేపట్టారు. అన్ని గ్రామాల్లో ర్యాలీకి ఘన స్వాగతం లభించింది. అమరావతి ఐకాస పేరుతో రూపొందించిన ఆకుపచ్చని జెండాలు చేత పట్టుకుని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 4.30 గంటల వరకూ సాగింది. తమ పోరాటాన్ని ప్రభుత్వం అవహేళన చేసినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతామని రైతులు తెలిపారు. అమరావతి పోరాటంలో కేవలం రాజధాని వాసులే కాకుండా రాష్ట్ర ప్రజలంతా కలిసి రావాలని ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రాంతాల్లోనూ ఉద్యమం విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.