తెలంగాణ

telangana

ETV Bharat / city

paddy procurement: పంటను అమ్ముకోవడానికి అన్నదాతల అరిగోస - ధాన్యం కొనడం లేదు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోసలు(farmers struggles) పడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షించినా ధాన్యాన్ని కొనడం లేదు. తాలు, తేమ పేరుతో మిల్లర్లు అడ్డగోలుగా కోతలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఓ వైపు లారీలు, గోనె సంచుల(gunny bags) కొరత మరో వైపు వర్షాలు పడుతుండటంతో కర్షకులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది.

ధాన్యం కొనుగోళ్లు
paddy procurement

By

Published : May 30, 2021, 4:12 AM IST

Updated : May 30, 2021, 5:56 AM IST

పంటను అమ్ముకోవడానికి అన్నదాతల అరిగోస

వానాకాలం ప్రారంభమైనా రాష్ట్రంలో కొనుగోళ్లు(paddy procurement) పూర్తి కాక ధాన్యం కేంద్రాల్లోనే మూలుగుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం శివారెడ్డి గూడెంలో రోజుల తరబడి వేచి ఉన్నా కొనుగోళ్లు జరపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ లేకుండా ధాన్యం ఆరబోసి... తాలు లేకుండా జల్లీ పట్టినా అడ్డగోలుగా కోతలు విధిస్తున్నారని వాపోతున్నారు. మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి బీ గ్రేడ్‌ ధర చెల్లిస్తున్నారని చెబుతున్నారు.

కోతలు పేరుతో కొర్రీలు..

నిబంధనల ప్రకారం పంటను ఆరబెట్టి శుభ్రం చేసినా కోతలు విధిస్తూ దోచుకుంటున్నారని చెబుతున్నారు. అడుగడుగునా డబ్బులు దండుకుంటున్నారని వాపోతున్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలంలో పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను ఎత్తాలంటే లారీలకు డబ్బులు చెల్లించాలని... తాలు, తేమ పేరిట కొనుగోలు కేంద్రంలో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ధాన్యం మిల్లుకు చేరగానే తేమ, తాలు ఉందని మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు తరుగు తీస్తున్నారని... లేకపోతే పంటను కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. ఐకీపీ నిర్వాహకులు, అధికారులు తమకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారన్నారు.

కొనుగోళ్లలో జాప్యం..

మరో వైపు కొన్నిచోట్ల కొనుగోళ్లలో జాప్యంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా(warangal urban district) సంగెం మండలం చింతలపల్లిలో రైతులు రోడ్డుపై ధాన్యం బ‌స్తాలు తగలబెట్టారు. అధికారుల అలసత్వంతో 3 వారాలైనా పంటను కొనుగోలు చేయడం లేదని వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి త్వరగా కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగామ(jangaon) జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలలో ధాన్యానికి నిప్పుపెట్టి రైతులు ఆందోళన నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

రైతుల‌ను ఇబ్బంది పెట్టొద్దు..


ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడం లేదనే ఫిర్యాదులతో వరంగల్ గ్రామీణ జిల్లా ప‌ర్వత‌గిరి మండ‌లం క‌ల్లెడలో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి తనిఖీ చేశారు. వారం రోజుల్లోగా ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. తాలు, తేమ పేరుతో రైతుల‌ను ఇబ్బంది పెట్టొద్దని... త‌డిసిన ధాన్యాన్ని కూడా సేక‌రిస్తామ‌ని రైతులకు భరోసా క‌ల్పించారు. జూన్ 5 వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇవీ చూడండి:raithubandhu: జూన్‌ 15 నుంచి రైతుబంధు సాయం పంపిణీ

Last Updated : May 30, 2021, 5:56 AM IST

ABOUT THE AUTHOR

...view details