ప్రస్తుతం యాసంగి వరి, మొక్కజొన్న పంటలు కోతలు జరుగుతున్నాయి. యంత్రాల సహాయంతో వరికోతలు చేపట్టినప్పటికీ.. మొక్కజొన్న కోతలను కూలీలతో చేపడుతున్నారు. కంకులను విరిచేందుకు వస్తున్న కూలీల కూలి రేట్లు అధికమవ్వడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క వాతావరణంలో వస్తున్న మార్పులతోనూ అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. రెండు మూడు రోజుల కిందట జనగామ, మహబూబాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. చేతికొచ్చిన పంటలను వర్షం రూపంలో నష్టపోతామనే భయంతో పొలాల వద్ద కల్లాల్లో ఉన్న పంటను కాపాడుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నూర్పిడి చేసిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. పశువుల మేతకు వినియోగించే గడ్డి తడిసి పాడవకుండా కుప్పలుగా పెట్టుకుంటున్నారు.
పెరుగుతున్న రేట్లు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 4,88,184 ఎకరాల్లో వరి, 2,26,074 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టారు. వరికోత యంత్రాలు అందుబాటులో లేవని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి కోతకు యంత్రాల నిర్వాహకులు గంటకు రూ.1800 నుంచి రూ. 2 వేల వరకు తీసుకుంటున్నారు. మొక్కజొన్న చేను కోసి, కంకులు విరిచేందుకు వస్తున్న మహిళా కూలి రేటు రూ.150 నుంచి రూ.300కు, మగ కూలి రేటు రూ.400 నుంచి రూ.500కు పెరిగింది
ప్రారంభమవుతున్న కొనుగోలు కేంద్రాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,031 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వరి కోతలు ప్రారంభం కావడంతో చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులతో కేంద్రాల వద్దకు అమ్మడానికి తీసుకొవచ్చిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు. అనుకోకుండా వర్షం కురిస్తే తడిసి ముద్దవుతాయని ఆందోళన చెందుతున్నారు.