ఏపీలో ఇటీవల ఎన్నికలు జరగని 32 నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లోనూ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. డివిజన్లు/వార్డుల పునర్విభజన, వాటికి రిజర్వేషన్ల ఖరారును... ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. కాకినాడలో పాలకవర్గం ఉన్నందున మరో 3 నగరపాలక, 29 పురపాలక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. శ్రీకాకుళం, నెల్లూరు నగరపాలక సంస్థల్లో కొత్త ప్రాంతాల విలీన అవరోధాలు తొలగిపోవడంతో ఇటీవలే డివిజన్ల పునర్విభజన పూర్తిచేశారు. శ్రీకాకుళంలో డివిజన్ల సంఖ్య 35కు, నెల్లూరులో 54కి పెరిగాయి. ఈ రెండు నగరాలలోనూ సామాజిక సర్వే ప్రారంభమైంది. రాజమహేంద్రవరంలో 10 గ్రామ పంచాయతీలను విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో వేసిన కేసు విచారణలో ఉన్నందున డివిజన్ల పునర్విభజన చేపట్టలేదు.
పురపాలక సంఘాల్లో...
శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీకి గ్రేడ్-3 పురపాలక సంఘంగా వర్గోన్నతి కల్పించారు. ఇప్పటివరకు 13 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డుల పునర్విభజన పూర్తిచేశారు. వీటిలో వైఎస్‌ఆర్ తాడిగడపలో 38 వార్డులను ఖరారు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వార్డుల సంఖ్య 39కి, తాడేపల్లిగూడెంలో 40, పాలకొల్లులో 35, తణుకులో 34, నెల్లూరు జిల్లా కావలిలో 40, అల్లూరులో 20, గూడూరులో 34, ప్రకాశం జిల్లా కందుకూరులో 32, పొదిలిలో 20, గుంటూరు జిల్లా బాపట్లలో 35, చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో 20, కడప జిల్లా రాజంపేటలో 29కి వార్డులు పెరిగాయి. మరో 15 పురపాలక సంఘాల్లో ఏప్రిల్‌లో వార్డుల పునర్విభజన చేయనున్నారు. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల నిర్వహణ కోసం మేలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందించనున్నారు.
ఇదీచదవండి:పొద్దునేమో భానుడి భగభగ... రాత్రిపూట ఉక్కపోత