తెలంగాణ

telangana

ETV Bharat / city

Amaravati Moment : 'ఉద్యమాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తాం' - amaravthi farmers latest updates

Amaravati Moment : ఏపీ రాజధాని అమరావతిని కాపాడుకోవాలన్న తపన, ఆకాంక్ష.. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా.. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజల్లోనూ బలీయంగా కనిపించాయని, దారి పొడవునా వారు చూపిన ఆదరణే తమను ఉత్సాహంగా ముందుకు నడిపించిందని అమరావతి రైతుల మహా పాదయాత్రలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమ నాయకులు పేర్కొన్నారు.

Amaravati Farmers JAC
Amaravati Farmers JAC

By

Published : Dec 28, 2021, 11:05 AM IST

Amaravati Moment : ‘అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ప్రతి ఊరిలోనూ ప్రజలు అడుగడుగునా అండగా నిలిచారు. వేల సంఖ్యలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆదరించి అన్నం పెట్టారు. జోరు వానలో తడుస్తున్న మహిళల్ని ఇళ్లకు ఆహ్వానించి తోబుట్టువుల్లా చూసుకున్నారు’ అని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ ఎ.శివారెడ్డి, కో కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు, అమరావతి రైతు జేఏసీ మహిళా నాయకురాలు కె.శిరీష వివరించారు.

Amaravati Moment Leaders Interview : అమరావతిని కాపాడుకోవాలని ప్రజల్లో బలీయంగా ఉన్న ఆకాంక్ష, వారు కనబరిచిన ఆదరణ చూశాక.. మాపై బాధ్యత మరింత పెరిగింది. ఏకైక రాజధానిగా అమరావతిని సాధించేంత వరకు పోరాడాలన్న బలమైన సంకల్పం ఏర్పడింది. ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి దగ్గరకు వెళ్లి.. అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తాం. అటు శ్రీకాకుళం నుంచి... ఇటు అనంతపురం వరకు ప్రతి జిల్లాకు పాదయాత్ర చేస్తాం. మొదట అన్ని జిల్లాల్లో జేఏసీలను పటిష్ఠం చేసుకుని, అందర్నీ అనుసంధానిస్తూ బృహత్తర కార్యక్రమం చేపడతాం.

అమరావతే ఏకైక రాజధాని..

Amaravati JAC Interview : అమరావతి ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు, ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాల్సిన అవసరాన్ని చాటి చెప్పేందుకు, ప్రజల మద్దతు కూడగట్టేందుకు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. ‘మేం 10% స్పందన ఊహిస్తే.. 200% వచ్చింది. పది కేజీల బియ్యం, కూరగాయలు తెచ్చి ఇచ్చినవాళ్లున్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే ముస్లిం సోదరులూ పళ్లు, మజ్జిగ, మంచినీళ్లు పంచారు. పాదయాత్ర మొదలైన రోజు నుంచే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. ప్రజలు తరలివచ్చి అండగా నిలిచారు’ అని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎందరో వచ్చి మద్దతు పలికారని వెల్లడించారు.

ప్రవాసాంధ్రుల అండ..

Amaravati Moment News : ‘ప్రవాసాంధ్రులూ మాకు అన్ని విధాలా అండగా నిలిచారు. అందరి అండతోనే 45 రోజులపాటు 550 కి.మీ.ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. మూడు రాజధానుల నిర్ణయంతో పాటు, వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకుంది. దాన్ని వ్యక్తపరచడానికి ప్రజలకు పాదయాత్ర ఒక వేదికగా నిలిచింది’ అని వారు పేర్కొన్నారు.

ప్రజల ఆదరణ చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి

Amaravati Farmers Protest : ‘నెల్లూరు జిల్లా సరిహద్దులోని రాజావారి చింతలపాలెంలో 70ఏళ్ల రైతు వెంకటేశ్వరరావు పది బస్తాల బియ్యం విరాళంగా ఇచ్చారు. ‘రాజధాని కోసం ఇంత కష్టపడుతున్న మీకు నా వంతుగా తోచిన సాయం చేయాలని... బియ్యం మర పట్టించి, వారం రోజులుగా ఎదురు చూస్తున్నాను’ అని ఆయన తెలిపారు. రాజధానితో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా, అమరావతిని కాపాడుకోవడానికి ఆ పెద్దాయన పడుతున్న తపన చూసి మా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అలాంటి వారు ఎందరో మాకు అండగా నిలిచారు’ అని నేతలు వివరించారు.

అణచివేయాలని చూసిన ప్రతిసారీ మూడు, నాలుగు రెట్లు జనం వచ్చారు

‘పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూశాక ప్రభుత్వం అడుగడుగునా అణచివేయాలని చూసింది. కల్యాణ మండపాలు ఇవ్వకుండా వాటి యజమానుల్ని పోలీసులతో బెదిరించింది. మేం భోజనాలు చేయాలనుకున్న స్థలాన్ని దున్నేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడింది. ప్రభుత్వం మమ్మల్ని అణచివేయాలని చూసిన ప్రతిసారీ జనం మూడు నాలుగు రెట్లు ఎక్కువ వచ్చారు. తిరుపతిలో ముగింపు సభకు మాకు 30 గంటల ముందే అనుమతి వచ్చింది. ఆ స్వల్ప వ్యవధిలోనే 35-40 వేల మంది హాజరయ్యారంటేనే ప్రజాభీష్ఠం ఎలా ఉందో అర్థమవుతుంది. మా ఉద్యమానికి అన్ని పార్టీలూ సహకరించాయి.'

-ఎ.శివారెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌

'వైకాపా శ్రేణులు కూడా చాలాచోట్ల తమ పేరు బయటకు చెప్పొద్దని, తామూ అమరావతికే అనుకూలమని చెబుతూ తమ వంతు సాయం చేశాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. పాదయాత్రను మాకున్న స్వల్ప వనరులతోనే, కొద్ది మందితో మొదలు పెట్టాలని, లక్ష కరపత్రాలను ముద్రించి దారి పొడవునా ప్రజలకు పంచాలని అనుకుని నడక ప్రారంభించాం. ప్రజల నుంచి ఇంత భారీ స్పందన వస్తుందని అసలు ఊహించలేదు. వైకాపా నాయకులు కొందరు... వారి జిల్లాల్లోకి పాదయాత్రను అడుగుపెట్టనివ్వబోమన్నారు. అడ్డంకులు సృష్టించారు. ఏం రైతులు చేయకూడదా? వై.ఎస్‌. కుటుంబానికే హక్కులున్నాయా? జగన్‌ ముఖ్యమంత్రి కావడానికి పాదయాత్ర చేశారు. మేం రాష్ట్రం బాగు కోసం పాదయాత్ర చేశాం.’

-ఎ.శివారెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌

ఈ ప్రభుత్వం ఎస్సీలను జెండా మోసేవాళ్లుగానే చూస్తోంది

‘నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతును. రాజధాని గ్రామాల్లో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, బలహీనవర్గాలవారే. ఈ ప్రభుత్వం ఎస్సీలను ఓటు బ్యాంకుగానూ, జెండాలు మోసేవారుగానూ చూస్తుందే తప్ప, వారిని ఆర్థికంగా పరిపుష్టం కానివ్వడం లేదు. మూడు రాజధానుల నిర్ణయం ఎస్సీల అభివృద్ధికి గొడ్డలిపెట్టు. రాజధాని ఉన్న తాడికొండతో పాటు, చుట్టుపక్కల మరో నాలుగు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి.'

-కె.శిరీష, అమరావతి రైతు జేఏసీ నాయకురాలు

అమరావతిని అభివృద్ధి చేస్తే, ఈ ప్రాంతాలతో పాటు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానులతో రాష్ట్రం అథోగతి పాలవుతుంది. అమరావతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలదీ అని చాటి చెప్పేందుకు, దాన్ని కాపాడుకునేందుకు నిర్వహించిన మహాపాదయాత్రలో ఎస్సీ రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర మొత్తం మహిళల సంరక్షణ చూసే బృందానికి నేను సారథ్యం వహించాను. ప్రభుత్వం మాపై పెడుతున్న నిర్బంధాలు, కేసులు, ఆంక్షలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అడ్డంకులు సృష్టించాలని చూసిన పోలీసులపై మా తరపున ప్రజలే తిరగబడ్డారు. మాపై కేసులు పెట్టినా పర్వాలేదు, మీ పాదయాత్ర మాత్రం ఆగకూడదని మాకు భరోసా ఇచ్చారు. పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు.. 45 రోజులకుపైగా ఇల్లు, వాకిలి, పిల్లల్ని వదిలేసి వెళుతున్నాం.. చివరి వరకు వెళ్లగలమా అన్న భయంతో కన్నీళ్లొచ్చాయి. మొదలయ్యాక ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూశాక.. ఆ కన్నీళ్లే ఆనంద బాష్పాలయ్యాయి’

-కె.శిరీష, అమరావతి రైతు జేఏసీ నాయకురాలు

వారి ఆంక్షలు ఉద్యమానికి మరింత ఊపిరి పోశాయి

‘మేం ఏ రోజూ రాత్రి భోజనాలు సొంతంగా ఏర్పాటు చేసుకోలేదు. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం.. మేం ఎక్కడ బస చేస్తే అక్కడి ప్రజలే సమకూర్చారు. కొందరు మహిళలు ఆ మార్గంలో వెళుతూ మమ్మల్ని చూసి ఆగి, వేలికి ఉన్న ఉంగరాలు తీసి విరాళంగా ఇచ్చేశారు. 250 నుంచి 300 మందితో పాదయాత్ర చేయాలని, మద్దతు చెప్పడానికి వచ్చే వారితో కలిపి మధ్యాహ్నం వెయ్యి మంది వరకు ఉంటారని మొదట్లో అనుకున్నాం. అయితే ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టిన మొదటి రోజు మధ్యాహ్నం 12 వేల మందికి వండి పెట్టాం. నాగులుప్పలపాడులో.. అర్ధరాత్రి దాటాక భారీ వర్షం కురవడంతో టెంట్‌లన్నీ తడిచిపోయాయి. రైతులంతా తడిచిపోయి కోల్ట్‌స్టోరేజీ పోర్టికోలో సర్దుకుని కూర్చున్నారు. ఏ పాకిస్థాన్‌కు చెందినవారో అక్రమంగా వచ్చి ఒక భవనంలో ఉంటే.. ఎలా కాపలా కాస్తారో అలా వందల మంది పోలీసులతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని చూశారు. అయితే.. ఎమ్మెల్యే గ్రామానికి సమీపంలోని పొదలకూరులో వేలాదిగా జనం వచ్చి మాకు స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా కోవూరులో సీఎం సామాజికవర్గానికి చెందిన వారే పాదయాత్రలో నడుస్తున్న మహిళలందరికీ ఒక గుడిలో ఆశ్రయమిచ్చారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో టీ తాగడానికి వెళితే.. వాటి దుకాణాల యజమానులు టీ ఇచ్చి, డబ్బులు తీసుకోలేదు. ప్రజలు ప్రతి విషయాన్నీ గమనిస్తున్నారు. చాలా అవగాహనతో ఉన్నారు. మూడు రాజధానులు రాష్ట్ర అభివృద్ధికి విఘాతమని నమ్మబట్టే వారంతా మాకు బాసటగా నిలిచారు’.

-గద్దె తిరుపతిరావు, అమరావతి పరిరక్షణ సమితి కో కన్వీనర్‌

ABOUT THE AUTHOR

...view details