అర్పితా రాయ్ భవిష్యత్తు గురించి అందమైన కలలు కనేది. కానీ ఓ దుర్ఘటన తన జీవితాన్నే మార్చేసింది. ఆ కష్టాల్ని పంటిబిగువున భరించి...కుంగుబాటుని జయించింది. యోగా గురువుగా మారి ఇలా ఎదుర్కోవాలి జీవితాన్ని అని చూపిస్తోంది.
అప్పుడు అర్పితకు 20 ఏళ్లు. 2006, ఏప్రిల్‌లో ఓరోజు బైక్‌లో వెళుతూ అదుపు తప్పి కిందపడిపోయింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లిపోయింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఎవరో ఆసుపత్రిలో చేర్చారు. ‘ప్రాణం నిలబడినా... రెండుకాళ్లు నుజ్జునుజ్జు అయిపోయాయి. ప్రాణాన్ని కాపాడటం కోసం కాళ్లను తొలగించాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నేను ఇకపై కనీసం అడుగులైనా వేయలేననే ఆలోచనే తీవ్రంగా కుంగదీసింది. నాలుగు నెలలు బెడ్ మీదే ఉండటంతో బెడ్‌సోర్స్ వచ్చాయి. ఆ బాధలన్నీ పంటి బిగువునే భరించా. ఇంటికి చేరుకున్నాక బంధువులు, తెలిసిన వారు ఏవేవో చెప్పే వారు. అవన్నీ నాపై తీవ్ర ప్రభావాన్ని చూపేవి. వీటన్నింటినీ దాటి, నన్ను నేను కాపాడుకోవాలనే ఆలోచన నాలో మొదలైంది. నాలాంటి వాళ్ల విజయాల గురించి చదవడం మొదలుపెట్టా’ అని గుర్తు చేసుకుంటుంది అర్పిత.
పదిసార్లకు పైగా విఫలమై...
వైద్యులు అర్పితకు కృత్రిమ కాళ్లను పెట్టారు. ప్రమాదం జరిగిన ఎనిమిది నెలల తర్వాత మెల్లిగా అడుగులేయడం ప్రారంభించింది. ఫిజియోథెరపీతో పాటు యోగా కూడా చేసేది. అలా కొంత ఉపశమనం వచ్చిందామెకు. ఇన్‌స్టాగ్రాంలో ఫొటోలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే తన వైకల్యం తెలియకుండా దుస్తులు ధరించి పోస్ట్ చేసేది. ఆ సమయంలో ఓ స్నేహితుడు ‘మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనలోని లోపాన్ని అంగీకరించడం నేర్చుకుంటేనే జీవితాన్ని జయించగలం’ అని చెప్పాడు. ఆ మాటలు తన దృక్పథాన్ని మార్చేశాయి. ‘నా ఫ్రెండ్ మాటలలో నా కృత్రిమ కాళ్లు తెలిసేలా యోగా భంగిమ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పెట్టా. అయితే ఏం వ్యాఖ్యలు వస్తాయో అనే భయంతో రోజంతా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. మరుసటి రోజు చూస్తే... ఎంతోమంది ప్రశంసించారు. వీరిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఇక అప్పటినుంచి ఆన్‌లైన్‌లో యోగా బోధిస్తున్నా. దేశవ్యాప్తంగా అయిదు వందల మందికిపైగా వీటికి హాజరవుతున్నారు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉండేందుకు బరువును తగ్గించుకున్నా. నేను నేర్పే ప్రతి వ్యాయామం కృత్రిమకాళ్లతో చేయడం కష్టం. పదిసార్లుకు పైగా విఫలమై, ఆ తర్వాతే శీర్షాసనం వేయగలిగా. నా విజయాన్నే కాదు, నా ఇబ్బందులు కూడా అందరికీ తెలియజేసేలా వీడియోలను పోస్ట్ చేస్తుంటా. అప్పుడే కదా... వైఫల్యం నుంచి విజయం ఎలా సాధించాలో తెలుస్తుంది. ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు తొమ్మిదేళ్లు పట్టింది. చాలా కాంటెస్ట్‌ల్లో విజేతగా నిలిచా. యోగా జర్నల్‌లో నా గురించి ప్రచురించడం మరవలేను. ఇవన్నీ నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతూనే ఉన్నాయి’ అని చెబుతున్న అర్పితారాయ్ త్వరలో కృత్రిమ అవయవాల కేంద్రాలతో కలిసి పనిచేయనుంది. వికలాంగులకు కౌన్సిలింగ్‌తో ఆత్మవిశ్వాసాన్ని అందించాలనుకుంటోంది.
బరువు పెరిగానని...!
బరువు పెరుగుతోందని నాన్న యోగా శిక్షణలో చేర్చితే... దాన్నే కెరీర్‌గానూ మార్చుకుంది భీమవరానికి చెందిన టేకుమూడి శిరీష. ‘అప్పటికి నాకు పద్దెనిమిదేళ్లు. బరువు పెరుగుతున్నానని నాన్న తనతో పాటు యోగాకి తీసుకెళ్లేవారు. అక్కడి గురువు భూపతిరాజు సత్యనారాయణ రాజు నా తీరు చూసి పోటీలకు శిక్షణ కోసం సీతారామయ్య అనే మరో గురువు దగ్గరకు పంపారు. రోజూ కాలేజీ, ట్యూషన్ అయిపోయాక పది కిలోమీటర్లు వెళ్లి నేర్చుకునే దాన్ని. తర్వాత జిల్లా, రాష్ట్ర పోటీల్లో పతకాలు అందుకున్నా. యోగాలో పట్టు కోసం... టీచర్ ట్రెయినింగ్ డిప్లొమా చేశా. హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠాలు చెప్పేదాన్ని. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తరగతులు నిర్వహించేదాన్ని. 2012లో పెళ్లి తర్వాత విరామం వచ్చినా సాధన మానలేదు. పాపని, ఇంటినీ చూసుకుంటూ, పిల్లలకు శిక్షణ ఇస్తూనే... ఎంఎస్సీ, ఎంఫిల్ చేశా. అంకమ్మరావు గారనే గురువు జాతీయ పోటీలకు శిక్షణ ఇచ్చారు. అలా 2018లో జాతీయ యోగాసనాల ఛాంపియన్‌షిప్‌లో నాలుగోస్థానం సాధించా. పంజాబ్‌లో జరిగిన పోటీల్లో కాంస్యం దక్కింది. నా ప్రతిభను గమనించిన శాప్ అధికారులు యోగా క్లాసులు చెప్పే అవకాశం కల్పించారు. గతేడాది మలేషియా, దక్షిణాఫ్రికాల్లో ప్రపంచ పోటీలకూ అర్హత సాధించా. కరోనా వల్ల అవి వాయిదా పడ్డాయి. ఈ జనవరిలో వర్చువల్‌గా నిర్వహించిన జాతీయ పోటీల్లో వెండి పతకం అందుకున్నా. ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఈ గుర్తింపు సాధించా’ అంటారామె. శిరీష విదేశాల్లోని భారతీయులకు ఆన్‌లైన్‌లో యోగా శిక్షణ ఇస్తోంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకూ తరగతులు తీసుకుంటోంది. పేద చిన్నారులకు ఉచితంగా.. యోగా నేర్పిస్తూ పోటీలకు పంపిస్తోంది.
89 ఏళ్ల వయస్సులోనూ...