Platelets Increase Food Items: ఒకప్పటితో పోలిస్తే- కారణాలేమయినప్పటికీ ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోవడం అన్నది ఈమధ్యే ఎక్కువగా వినిపిస్తోంది. కొవిడ్, చికున్‌గన్యా, డెంగీ... వంటి వైరల్ జ్వరాలు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, లుకీమియా, ఆల్కహాల్ అతిగా తీసుకోవడం, కాలేయ, ప్లీహ సమస్యలతోపాటు కొన్ని రకాల మందులు వాడినప్పుడూ ఈ ప్లేట్‌లెట్స్ పడిపోవడం జరుగుతుంటుంది. అందుకే అవి తగ్గకుండా ఉండేందుకు పోషక నిపుణులు కొన్ని రకాల ఆహార పదార్థాలను విధిగా తీసుకోమని చెబుతున్నారు. ఇంతకీ అవేంటో చూద్దామా..
ప్లేట్‌లెట్స్...ఇవీ ఒక రకం రక్త కణాలే. వీటినే థ్రాంబోసైట్స్ అనీ పిలుస్తారు. ఎర్ర రక్తకణాలు శరీరమంతా ఆక్సిజన్ అందేలా చేస్తే, తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. ఇక, ప్లేట్‌లెట్స్ రక్తం గడ్డకట్టడానికి దోహదపడతాయి. మైక్రోలీటరు రక్తంలో లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల వరకూ ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఇవి దాదాపుగా 5-10 రోజులు మాత్రమే జీవిస్తాయి. ఈ ప్లేట్‌లెట్స్ ఎప్పటికప్పుడు ఎముక మజ్జ నుంచి ఉత్పత్తి అవుతూ రక్తంలో కలుస్తుంటాయి. రోగనిరోధక వ్యవస్థలో భాగంగా ఇవీ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి. అయితే వైరస్ తీవ్రత ఎక్కువయ్యేకొద్దీ ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతుంటుంది. కనీస సంఖ్య లక్షన్నర నుంచి బాగా తగ్గితే - అంటే సుమారు యాభై వేలకన్నా తక్కువకి పడిపోతే నీరసం, కళ్లు తిరిగి పడిపోవడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చర్మంమీద రాషెస్ రావడం, విరేచనం నల్లగా అవ్వడం... వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన పరిస్థితినే థ్రాంబొసైటొపీనియాగా పిలుస్తారు. వీటి సంఖ్య ఇంకా తగ్గిపోతే మెదడు, పేగు, కండర భాగాల్లో రక్తం కారి, ప్రాణానికే ప్రమాదంగా పరిణమిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్లేట్‌లెట్స్ ఎక్కించడం అనేది తప్పనిసరి. అందుకే ఆయా జ్వరాల బారినపడ్డప్పుడు- ముందుగానే పోషకాలన్నీ ఉండే కొన్ని ఆహారపదార్థాలని విధిగా తీసుకుంటే ప్లేట్‌లెట్స్‌కి ఢోకా ఉండదు అంటున్నారు పోషక నిపుణులు.
బొప్పాయి..డెంగీ జ్వరాలతో ఆమధ్య బొప్పాయికి ఎక్కడలేని గిరాకీ ఏర్పడటం తెలిసిందే. అయితే పండుకన్నా ఈ చెట్టు ఆకుల్లో ఉన్న కైమోపపైన్, పపైన్‌లు హీమోగ్లోబిన్‌తోపాటు రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్యను త్వరగా పెంచినట్లు మలేషియాలోని ‘ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’కి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. డెంగీతో దెబ్బతిన్న కాలేయ పనితీరునీ మెరుగుచేస్తాయివి. అందుకే ఈ మొక్క లేత ఆకుల్ని మరిగించి ఆ రసాన్ని టేబుల్‌స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య ఒక్కరోజులోనే పెరిగిందట. 68 వేలకు పడిన వీటి సంఖ్య కేవలం పన్నెండు గంటల్లోనే రెండు లక్షలకు చేరినట్లు కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి. దాంతో ఈ ఆకుల రసంతో చేసిన సప్లిమెంట్లూ వస్తున్నాయి. పచ్చి బొప్పాయి తిన్నా మేలు జరుగుతుంది. అలాగే బొప్పాయి పండ్లలోని సి-విటమిన్ వల్ల కూడా ఫలితం ఉంటుంది అంటున్నారు కొందరు వైద్య నిపుణులు.
దానిమ్మ..ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతోపాటు ఐరన్ మెండుగా ఉండటంతో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గకుండా ఉంటుంది. రోజూ ఓ గ్లాసు దానిమ్మ రసాన్ని కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తాగితే రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
గోధుమ గడ్డి..యూనివర్సల్ ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన నిపుణులు గతంలో చేసిన ఓ అధ్యయనంలో గోధుమ గడ్డి కారణంగా ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరిగినట్లు తేలింది. దీనివల్ల ఎర్ర రక్తకణాలు, హీమోగ్లోబిన్, తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరిగిందట. ఇందులో అధికంగా ఉండే క్లోరోఫిల్ హీమోగ్లోబిన్ నిర్మాణాన్ని పోలి ఉండి, అచ్చం దానిలానే పనిచేస్తుందట. అందుకే అరకప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని పిండుకుని రోజూ తాగితే ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. ముఖ్యంగా కీమోథెరపీ సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
పాలు.. కాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా ఉండే పాలు ఎముకలూ కండరాల వృద్ధికి తోడ్పడితే, పాలల్లోని కె-విటమిన్ రక్తం గడ్డకట్టేందుకు సాయపడుతుంది. కాబట్టి రోజూ గ్లాసు పాలు తాగితే ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగడం ఖాయం అంటున్నాయి మరికొన్ని పరిశీలనలు. అలాగే డి-విటమిన్, ఫోలేట్ పుష్కలంగా ఉండటం వల్ల పాలు తాగితే రోగనిరోధకశక్తీ పెరుగుతుంది.
డ్రాగన్ ఫ్రూట్..డెంగీ వైరస్ రక్తాన్ని గడ్డ కట్టించే థ్రాంబిన్‌ను అడ్డుకోవడంతో అంతర్గత అవయవాల్లో బ్లీడింగ్ సమస్యలు తలెత్తుతాయి. అవి లేకుండా చేయగల శక్తి డ్రాగన్ ఫ్రూట్‌కు ఉంది అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లూ ఫైటోన్యూట్రియంట్లూ లైకోపీన్ పీచూ ఐరన్ శాతం ఎక్కువ. కాబట్టి డ్రాగన్ పండు వ్యాధి తీవ్రతని తగ్గిస్తుంది. ఎరుపురంగు డ్రాగన్ తొక్కతో చేసిన పెరుగు తినడంవల్ల హీమోగ్లోబిన్, ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగినట్లు ఎలుకలపై చేసిన పరిశీలనలోనూ తేలిందట.
కివీ..ఇందులో ప్రొటీన్, కాల్షియం, పొటాషియంతోపాటు సి, కె, ఇ విటమిన్లు పుష్కలం. కాబట్టి రక్తహీనత, బి-విటమిన్ లోపంతోనూ వైరల్ ఇన్ఫెక్షన్లతోనూ బాధపడేవాళ్లు రోజుకి రెండు కివీ పండ్లను తినడం వల్ల ఫలితం ఉంటుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోకుండానూ కాపాడుతుందీ పండు.
ఉసిరి..సి-విటమిన్ సమృద్ధిగా ఉండే ఉసిరి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తద్వారా రక్తంలో ప్లేట్‌లెట్లూ వృద్ధి చెందుతాయి. అందుకే డెంగీ జ్వర బాధితులకి కాస్త ఉసిరి రసాన్ని పట్టిస్తే ఫలితం ఉంటుంది. లేదా పరగడుపున మూడూనాలుగు ఉసిరికాయల్ని నేరుగానో లేదా జామ్ రూపంలోనో తీసుకున్నా మేలేనట.