జన నాట్యమండలి మాటై, పాటై రగిలిన ప్రతిఘటనే 'వంగపండు' ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలోని పెద బొండపల్లిలో 1943లో వంగ పండు ప్రసాదరావు జన్మించారు. 1972 నుంచి జన నాట్యమండలిలో రచయితగా...కళాకారునిగా ఎదిగారు. దాదాపు 700 ప్రజాగీతాలను రాసిన ఆయన...2017లో కళా రత్న పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఎంతో మంది పలు రకాలుగా వర్ణించినా... వంగపడు తీరు మాత్రం అతని కళా నైపుణ్యానికి అద్దం పడుతుంది.
తూరుపు దిక్కున జారు భూములు.. పడమటి దిక్కున పంట భూములు...
జాతాపులు, ఆ భూముల మీద సెమట జల్లుతారో నాయన...
సవరన్నలు ఆ భూముల మీద సాలు దున్నుతారో నాయన...
ఆకు సిక్కితే ఆల రక్తమూ అక్కడ కారుద్దోయ్...
మొక్క పీకితే సిక్కని సెమట సుక్కలు పడతయ్ రోయ్...అంటూ భూమికీ, శ్రమకీ, గిరిజనులకూ ఉండే జీవన బంధాన్ని వివరిస్తారు వంగపండు. విశాఖ సిరిపురం రహదారి నిర్మాణంలో శ్రీకాకుళం మహిళా కూలీల జీవనాన్ని వంగపండు ప్రతిబింభించిన తీరు ఆయన కవితా పాటవాన్ని సాక్షాత్కరిస్తుంది. ఒక నాగరికత, నగరం అభివృద్ధి క్రమంలో శ్రమైక జీవన సౌందర్యం అసలు రహస్యాన్ని వంగపండు ఇలా వివరించారు.
'సదవు లేదని నువ్వు కలత చెందకు పిల్లా...ఎంత సదువుకున్నా, ఎన్ని సోకులు వున్నా నిను మించరె పిల్లో నాకూలొల పిల్లా...ఎనక కుచ్చెల సీర ఎత్తు నడుమున గట్టి అందమైనా సూడవ్... అద్దమైనా సూడవ్ నిన్ను మించరె పిల్లా... నాకూలొల పిల్లాఅంటూ తన గళాన్ని వినిపించాడు.
విశాఖ షిప్ యార్డులో ఓడ జలప్రవేశం అయిన సందర్భంలో తాము నిర్మించిన ఓడ వెళ్లిపోతుంటే కార్మికుల ఆవేదనను ఆవిష్కరించారు. అప్పుడు.....'ఓడా నువ్వెళ్లిపోకే... మా కండలన్నీ పిండిజేసి...నీటిలోని కోటలాగ...ఎముకలొంచి కట్టినాము...కడుపులోని పేగులు వైరింగుని చేశాడు...తన కళ్లు రెండు తీశాడు...ఆడు బలుపులు తగిలించాడు...కళ్లు వెలుగు తీశాడు...కరెంటు జేసి పంపాడు...జిగుజిగు మని లైటులు ఎలిగించాడంటూ కార్మికుల పడ్డ కష్టానికి తన పాటతో ప్రాణం పోశాడు.
వంగపండు రాసిన 'అరుణ పతాకమా' జననాట్యమండలి జెండా గీతమై చరిత్రలో నిలిచింది. శ్రీకాకుళ గిరిజన పోరాటాన్ని అభివర్ణిస్తూ ఆయన రాసిన 'భూమి బాగోతం' నృత్య రూపకం ఆ రోజుల్లో తెలుగు నేల నాలుగు చెరగులా వేలాది ప్రదర్శనలతో ఆకట్టుకొంది.
'కూడు గుడ్డాలేని కూలీ నాలోళ్లు... కొట్టాలి కొడవలికీ కక్కులు... అమ్మ ఎయ్యాలి ఓఓవి కుప్పలూ... పంటకు వచ్చింది కామందుల సేని... నీదీ నాదాని ఏడుపింక మాని... పట్టా పట్టూకోని... మనపొట్టలు కొట్టాలని లారీ తెచ్చిన బాబుకు తూరుపు సూపించరండి... వంటి పాటలు విప్లవ సాహిత్యంలో మిణుగురుల్లా నేటికీ మెరుస్తూనే ఉంటాయి.
వంగపండు రాసిన 'యంత్రమెట్టా నడుస్తు ఉందంటే'... గీతానికి సమాంతరంగా తెలంగాణాలో 'పల్లెలెట్టా రగులుతున్నయంటే' వంటి గీతాలు ఉద్యమంలోనికి వచ్చాయి. ఆయన రాసిన మరికొన్ని గీతాలు 'ఏరువాక' 'పొలికేక' సంకలనాలుగా ప్రచురితమయ్యాయి.
ఛత్తీస్‌ఘడ్ గిరిజనుల బాణీలను తీసుకొని విముక్తి కోసం చిత్రంలో ఆయన రాసిన గీతం 'అంబా తక్కాడే కుండలు గట్టేయ...అజా మనా రే అంబలి జుర్రీయ...కోదోలు కొండోలు ... కోరిక లేనోల్లూ... అంబాతకాడే కుండలు గట్టేయ...ఇక అర్ధరాత్రి స్వతంత్రంలో ఆయన రాసిన ఏం పిలడో ఎల్దమొస్తవా పాట సర్వజనామోదం పొందడమే కాక, ఇతర సినిమాల్లో రీమిక్స్‌ల వరకూ వెళ్లింది. అంతేకాదు ఆయన పాడిన పలు పాటలు తమిళం, బెంగాలీ, హిందీ, ఆంగ్ల భాషాల్లోకి అనువాదం కూడా అయ్యాయి.
ఎన్నో వందలాది విప్లవ, సామాజిక గీతాలనందించిన వంగపడు అనే పేరు... భారతీయ విప్లవ సాంస్కృతికోద్యమం ఊపిరి ఉన్నంత వరకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
ఇవీచూడండి:ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత