తెలంగాణ

telangana

ETV Bharat / city

కేటాయింపు రూ.293 కోట్లు.. కొనుగోళ్లు రూ.698.36 కోట్లు! - ఈఎస్​ఐ కుంభకోణం

ఏపీ ఐఎంఎస్‌లో ఔషధాల కొనుగోలు కోసం బడ్జెట్‌లో రూ.293.51 కోట్లు కేటాయిస్తే, రూ.698.36 కోట్ల మందులు కొన్నట్లు ఏసీబీ పేర్కొంది. ఇది 201-19 మధ్య జరిగిందని తెలిపింది. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ కేసు రిమాండు రిపోర్టులో ఈ వివరాలను తెలిపింది. ఇందులో మరో మాజీ మంత్రి పేరూ వినిపిస్తోంది.

కేటాయింపు రూ.293 కోట్లు.. కొనుగోళ్లు రూ.698.36 కోట్లు!
కేటాయింపు రూ.293 కోట్లు.. కొనుగోళ్లు రూ.698.36 కోట్లు!

By

Published : Jun 15, 2020, 10:53 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ఐఎంఎస్‌లో 2014-19 మధ్య ఔషధాల కొనుగోలు కోసం బడ్జెట్‌లో రూ.293.51 కోట్లు కేటాయిస్తే, రూ.698.36 కోట్ల మందులు కొన్నట్లు ఏసీబీ పేర్కొంది. ఆర్థిక లబ్ధి కోసం అదనంగా రూ.404.86 కోట్లు వెచ్చించారని వెల్లడించింది. అప్పటి ఐఎంఎస్‌ డైరెక్టర్‌ డా.జి.విజయ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ఈవన రమేష్‌బాబు, సూపరింటెండెంట్‌ ఎంకే పవన్‌ చక్రవర్తి, విశ్రాంత డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డా.వి.జనార్దన్‌, సాయిరామ్‌ ఫార్మాస్యూటికల్స్‌ యజమాని గోనె వెంకట సుబ్బారావులను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సమర్పించిన రిమాండు రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 2014 జూన్‌ - 2019 మార్చి మధ్య ఉన్న ఐఎంఎస్‌ డైరెక్టర్లు ఔషధాలు, పరికరాల కొనుగోళ్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. మార్కెట్‌ ధరలతో సరిపోల్చలేదు. ఓపెన్‌ టెండర్లు నిర్వహించకుండా ఆయా సంస్థల యజమానులతో కుమ్మక్కయ్యారు. బినామీ సంస్థలు, ఫోర్జరీ లెటర్‌హెడ్లు, నకిలీ కొటేషన్లతో ఔషధాల కొనుగోలు ఆర్డర్లను నాన్‌రేట్‌ కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టారు. నామినేషన్‌ ప్రాతిపదికన రూ.237 కోట్ల ల్యాబ్‌ కిట్లు కొన్నారు. 36% అధికంగా చెల్లించడంతో రూ.85 కోట్ల నష్టం వాటిల్లింది. రూ.47.77 కోట్ల సర్జికల్‌ పరికరాలను నాన్‌ రేట్‌ కాంట్రాక్టు సంస్థల నుంచి 129% అధిక ధరలకు చెల్లించడంతో రూ.10.43 కోట్ల నష్టం వచ్చింది. ఓపెన్‌ టెండర్లు పిలవకుండా రూ.6.62 కోట్ల ఫర్నిచర్‌ కొనుగోళ్లలో 70% అధిక ధరలు చెల్లించడం వల్ల రూ.4.63 కోట్లు నష్టపోయినట్లయింది.

మరో మాజీమంత్రి పితాని పేరూ..

ఔషధాల కొనుగోళ్ల కోసం అప్పటి ఐఎంఎస్‌ డైరెక్టర్ల సూచనమేరకు నాటి కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణను కలిసినట్లు గుంటూరు, విజయవాడలకు చెందిన పలు ఫార్మాసంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. కొనుగోలు ఆర్డరు వచ్చినందుకు మంత్రి తనయుడు వెంకట్‌కు 10%, అప్పటి డైరెక్టర్లు డా.సీకే రమేష్‌కుమార్‌, విజయ్‌కుమార్‌లకు తలో 10%, కడప ఈఎస్‌ఐ జేడీ, ఈఎస్‌ఐ ఉద్యోగులు చక్రవర్తి, జానకిరామ్‌లకు చెరో 5% లంచమిచ్చినట్లు జెర్కన్‌ ఎంటర్‌ప్రైజస్‌ సంస్థ యజమాని వరకూరి యశస్వి తెలిపారు. కొనుగోలు ఆర్డరు కోసం పితాని సత్యనారాయణ పీఏకు 10% చెల్లించినట్లు తిరుమల మెడికల్‌ ఏజెన్సీ యజమాని తెలుకపల్లి కార్తీక్‌, రూ.25 లక్షలు ఇచ్చినట్లు గోనె వెంకటసుబ్బారావు వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. ఫార్మసిస్టు ధనలక్ష్మికి లంచం ఇచ్చినట్లు పలువురు ఫార్మాసంస్థల యజమానులు వాంగ్మూలం ఇచ్చారు.

అప్పటి ఐఎంఎస్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌కు రూ.5 లక్షలు, 2 లాప్‌టాప్‌లు, 2 ట్యాబ్‌లు, రెండు ప్రింటర్లు లంచంగా ఇచ్చినట్లు ఓ సంస్థ ప్రతినిధి దినేష్‌ తెలిపారు.

ఇప్పటివరకూ లభించిన ఆధారాల మేరకు... వీరి నేరపూరిత దుష్ప్రవర్తనకు ప్రాథమిక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

  1. డా.సీకే.రమేష్‌కుమార్‌, ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌
  2. జి.విజయ్‌కుమార్‌, ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌
  3. కె.ధనలక్ష్మి, ఫార్మసిస్టు
  4. ఈవని రమేష్‌బాబు, సీనియర్‌ అసిస్టెంట్‌
  5. డి.మురళీమోహన్‌, అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పీఏ
  6. ఎంకేపీ చక్రవర్తి, సీనియర్‌ అసిస్టెంట్‌
  7. తోట జానకిరామన్‌, అడ్మిన్‌ అసిస్టెంట్‌ (కొనుగోలు అధికారి
  8. వి.జనార్దన్‌, అప్పటి ఐఎంఎస్‌ జేడీ, కడప
  9. రవితేజశ్రీ, జెర్కన్‌ ఎంటర్‌ప్రైజస్‌ యజమాన
  10. వరకూరి యశస్వి, అధీకృత ప్రతినిధి, జెర్కన్‌ ఎంటర్‌ప్రైజస్‌
  11. పి.వెంకట్‌, అప్పటి కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు
  12. పి.శ్రీరామమూర్తి, అమరావతి మెడికల్స్‌ యజమాని
  13. సీహెచ్‌.వేణుగోపాలరావు, అధీకృత ప్రతినిధి తిరుమల మెడికల్‌ ఏజెన్సీస్‌
  14. టి.కార్తీక్‌, యజమాని, తిరుమల మెడికల్‌ ఏజెన్సీస్‌
  15. జి.వెంకట సుబ్బారావు, సాయిరామ ఫార్మాస్యూటికల్స్‌ యజమాని
  16. తవ్వ రామలక్ష్మీ ప్రసన్నకుమార్‌, భాగస్వామి, వీరేష్‌ ఫార్మా
  17. తూముగుంట్ల దినేష్‌, డైరెక్టర్‌, ప్రొడిజీ కంప్యూటర్స్‌ అండ్‌ ల్యాప్‌ట్యాప్స్‌.

ఇదీ చదవండి:రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం​

ABOUT THE AUTHOR

...view details