హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఉండే సెలన్ లేబరేటరీస్ సంస్థ బ్లాక్ ఫంగస్ డ్రగ్ అంబిలాన్ 50 ఎంజీని ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆసుపత్రికి సరఫరా చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న రోగులకు డ్రగ్ ఇవ్వకుండా... ఈఎస్ఐ ఆస్పత్రిలో విధులు నిర్వహించే ప్రభుత్వ వైద్యుడు ఓబుల్ రెడ్డి తప్పుదారి పట్టించాడు. చింతల్‌లోని నందిని మెడికల్ దుకాణం యజమాని వికాస్‌రెడ్డికి అధిక ధరకు అమ్ముకున్నాడు. వికాస్ రెడ్డి కొంత లాభంతో మధ్యవర్తి అయిన నాగరాజు ద్వారా సుచిత్రకు చెందిన మానస మెడికల్ దుకాణ నిర్వాహకుడు శ్రీధర్‌కు అమ్ముకున్నాడు.
BLACK MARKET: బ్లాక్‌ఫంగస్ డ్రగ్‌ను అమ్ముకున్న ప్రభుత్వ వైద్యుడు
బ్లాక్ ఫంగస్‌తో సతమతమవుతున్న ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు వాటిని అధిక ధరలకు అమ్మడంతో పాటు నకిలీవి కూడా సృష్టిస్తున్నారు. ఈ తతంగంలో ప్రభుత్వ వైద్యులే ప్రధాన పాత్ర పోషిస్తుండటం విచారకరం. అంబిలాన్ 50 ఎంజీ డ్రగ్‌ను అధిక ధరలకు అమ్ముతున్న ముగ్గురు అక్రమార్కులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ డ్రగ్‌ను శ్రీధర్.. 5 నుంచి 10వేల లాభంతో అమ్మడంతో పాటు నకిలీవి సృష్టించాలని నిర్ణయించాడు. ఆన్లైన్లో సర్చ్ చేసి ఒరిజినల్ డ్రగ్ సీసాను పోలి ఉండే విధంగా తక్కువ ధరలో ఉండే మరో యాంటీబయోటిక్ డ్రగ్ ఎంచుకున్నాడు. ఆ సీసకున్న లేబుల్ తీసేశాడు. ఒరిజినల్ అంబిలాన్ స్టిక్కర్లను అతికించి... విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. ఈ సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు దాడి చేశారు. తయారు చేసిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వికాస్‌రెడ్డి, నాగరాజు, శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని... విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ వైద్యుడు ఓబుల్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని తెలిపారు. వీటితో పాటు ఓ కారు, ఓ ద్విచక్రవాహనం, 4 ఫోన్లు, 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.