ఈఎస్ఐ ఔషధాల కుంభకోణంలో నిందితులను అనిశా అధికారులు రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈఎస్ఐ సంచాలకురాలు దేవికారాణితో పాటు... మరో ఆరుగురిని రెండు రోజులపాటు విచారించనున్నారు. కేసు దర్యాప్తులో పురోగతి కోసం 5 రోజుల కస్టడీ కోరినా.. న్యాయస్థానం రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈకేసులో 13 మందిని అరెస్ట్ చేసిన అనిశా అధికారులు వారందరిని రిమాండ్కు తరలించారు. వీరిలో ఈఎస్ఐ ఉద్యోగులు ఏడుగురు ఉండగా.. ఫార్మా కంపెనీలకు చెందిన వాళ్లు ఆరుగురు ఉన్నారు.
వెనుక ఎవరున్నారు..
దేవికారాణితో సహా మిగతా ఆరుగురిని ప్రశ్నించడం వల్ల కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. కోట్ల రూపాయల అక్రమాల్లో ఎవరెవరి వాటా ఎంతనేది తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారు రూ. 200 కోట్ల అవినీతి జరిగినట్లు భావిస్తున్న అనిశా అధికారులు.. ఎవరు సహకరించారనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు.