ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా గ్రేటర్‌లోని 150 డివిజన్లలో డివిజన్‌కు ఒకటి చొప్పున ఆధునిక వ్యాయామశాలలు ఏర్పాటు చేసేందుకు రూ.10 కోట్లతో పరికరాలు కొనుగోలు చేశారు. సామాజిక భవనాలు, యువజన సంఘాల భవనాలను ఎంచుకున్నారు. కొన్ని డివిజన్లలో ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. ఆయా డివిజన్ల కోసం కొన్న పరికరాలు ఏమయ్యాయంటే క్రీడా విభాగం అధికారులు నీళ్లు నములుతున్నారు. ఏర్పాటు చేసినవి కూడా సకాలంలో తెరవకపోవడం, నిర్వహణ లోపం కారణంగా మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు, యువజన సంఘాలు పరికరాలు తీసుకుని ఇష్టానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
GYM : వ్యాయామానికి దూరం.. పెరుగుతున్నది కాయం - gyms in ghmc
కరోనా ఉద్ధృతి కారణంగా యువత, మధ్యవయస్కులు వ్యాయామానికి దూరమయ్యారు. స్థోమత ఉన్నవారు సొంతగా వ్యాయామ పరికరాలను కొనుగోలు చేశారు. 40-45 శాతం మంది ఇళ్లలో పరికరాలు సమకూర్చుకున్నట్లు ఓ అధ్యయనం పేర్కొంది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం గతంలో జీహెచ్‌ఎంసీ కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆధునిక జిమ్‌లు వివిధ కారణాలతో తెరవకపోవడం, తెరిచినా పరికరాలు పనిచేయకపోవడం వల్ల అక్కరకు రాకుండా పోయాయి. కరోనాను ఎదుర్కొనడంలో భాగంగా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడంపై దృష్టిసారిద్దామనుకుంటున్న యువతకు ఇది పెద్దసమస్యగా మారింది.
నగరంలో సుమారు 3 వేలకు పైగా ప్రైవేటు జిమ్‌లు ఉన్నాయి. వ్యాయామంపై దృష్టి పెట్టే యువకులు సుమారు 45 శాతం మంది ఉన్నట్లు అంచనా. వీరంతా ప్రైవేటు జిమ్‌లలో వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పోషకాహారం ఖర్చు దీనికి అదనం.
సర్దేశారు
జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన జిమ్‌లే అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో చాలా ప్రాంతాల్లో పరికరాలు సరిగా లేవని వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. కొన్నిచోట్ల ఒక గదికే పరిమితమయ్యాయి. నిరుపయోగంగా ఉన్న వ్యాయామ సామగ్రిని కొన్నిచోట్ల స్థానిక నేతలు ఇళ్లకు పట్టుకుపోయినట్లు ఆరోపణలున్నాయి. అదేమని ప్రశ్నించిన వారికి వేరే చోటికి తరలిస్తున్నామని తప్పించుకున్నారు.
- ఇదీ చదవండి :మనకు మనమే బరువవుతున్నామా..?
నిరాదరణకు ఇవీ నిదర్శనాలు
- వ్యాయామశాలల్లో శిక్షకుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలో శిక్షకులను నియమించే బాధ్యతలను డివిజన్ల కార్పొరేటర్లకే జీహెచ్‌ఎంసీ అప్పగించింది. కొన్నిచోట్ల శిక్షకులను నియమించి వేతనం ఇచ్చేవారు. తర్వాత అదీ లేకపోవడంతో శిక్షకులు, నిర్వాహకులు లేక జిమ్‌లు నిరాదరణకు గురయ్యాయి.
- ఎల్బీనగర్‌లోని లింగోజిగూడ కాకతీయ కాలనీ సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన జిమ్‌ను స్థానికుల విజ్ఞప్తి మేరకు శాతవాహన కాలనీకి మార్చారు. ఇప్పుడు అక్కడికి వెళ్లేవారు కరవయ్యారు.
- కర్మన్‌ఘాట్ క్రాంతిక్లబ్, హస్తినాపురం ఇంద్రప్రస్థ కాలనీలోని అనుపమనగర్, చైతన్యపురిలో ఓ ప్రైవేటు భవనంలో వ్యాయామశాలలు ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ఆదరణ పొందలేదు.
- చైతన్యపురి సాయినగర్ యోగా కేంద్రంలో, గణేశ్‌పురికాలనీ సంక్షేమ సంఘంలో నిరుపయోగంగా మారాయి.
- అత్తాపూర్, రాజేంద్రనగర్, శాస్త్రీపురం, మైలార్‌దేవ్‌పల్లి, అంబర్‌పేట్, బార్కస్, కంచన్‌బాగ్, రియాసత్‌నగర్, పత్తర్‌గట్టి తదితర డివిజన్లలోనూ ఇదే పరిస్థితి.
- నాగోల్, మన్సూరాబాద్ తదితర డివిజన్లలో నిర్వహణ ఫీజు కింద రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.