Employee Union Leaders On PRC: ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ వ్యవహారం.. ఇంకా కొలిక్కిరాలేదు. ఈ అంశంపై నిన్నంతా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ మరోసారి సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. సంక్రాంతి ముగిసేవరకూ.. హెచ్‌ఆర్‌ఏ సహా ఇతర అంశాలకు సంబంధించిన జీవోలు విడుదల చేయబోమని హామీ ఇచ్చినట్లు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
ప్రస్తుత పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదని సీఎంవో అధికారుల దృష్టికి తీసుకొచ్చామని బండి శ్రీనివాసరావు వెల్లడించారు. పాత పీఆర్‌సీ అయినా ఇవ్వాలని కోరామన్నారు. ఈ పీఆరీసీతో జీతాలు పెరగకపోగా.. తగ్గుతున్నాయని చెప్పామన్నారు.
"నిన్న రెండు సార్లు, ఇవాళ ఒకసారి చర్చలు జరిపాం. ప్రస్తుత పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదని చెప్పాం. పాత పీఆర్‌సీ అయినా ఇవ్వాలని కోరాం. హైదరాబాద్ నుంచి వచ్చినవారికి 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నారు. జిల్లా, పురపాలిక, మండలాల్లో పనిచేసే వారికి వివిధ కేటగిరిల్లో హెచ్‌ఆర్‌ఏ.. ఒకే కేటగిరీ చేసి హెచ్‌ఆర్‌ఏ తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. పీఆర్‌సీపై ఉద్యోగులు, పింఛనుదారులు అసంతృప్తితో ఉన్నారు. ఈ పీఆర్‌సీతో జీతాలు పెరగకపోగా.. తగ్గుతున్నాయని చెప్పాం. సంక్రాంతి వెళ్లాక సరైన రీతిలో న్యాయం చేస్తామని చెప్పారు. సీఎంతో మాట్లాడాకే జీవో ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ చర్యల మేరకు మా కార్యాచరణ ఉంటుంది. మా డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు రాజీలేని పోరాటం చేస్తాం.
- బండి శ్రీనివాస్, ఏపీ జేఏసీ ఛైర్మన్