ప్రస్తుతం దేశంలో కొవిడ్ మహమ్మారి తిష్ఠ వేసిన నేపథ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India).. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరింది. ఈ నెల 30వ తేదీలోపు సూచనలు పంపాలని గడువు విధించింది. 2021-22లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశంలో పలుచోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని గుర్తు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 2 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు..
తెలుగు రాష్ట్రాల్లో బద్వేలు, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కడప జిల్లాలోని బద్వేలు ఎమ్మెల్యే జీవీ సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మృతిచెందారు. ఈ స్థానానికి సెప్టెంబరు 28లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ జూన్ 12న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. డిసెంబరులోపు ఈ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.
ఆగస్టు 30వరకు గడువు..
కొవిడ్ ఉన్నందున ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఇదివరకే కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. వాటిపై రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఆగస్టు 30లోపు సూచనలు పంపితే వాటిని పరిగణనలోకి తీసుకొని మరింత సురక్షితం, విస్తృతమైన మార్గదర్శకాలు జారీ చేయడానికి వీలవుతుందని ఈసీ పేర్కొంది.