తెలంగాణ

telangana

ETV Bharat / city

సర్వస్వాన్ని కోల్పోయిన వారి జీవితాల్లో 'ఈనాడు' ఆనందాలు - సర్వస్వాన్ని కోల్పోయిన వారి జీవితాల్లో 'ఈనాడు' ఆనందాలు

ప్రకృతి వన్నెలద్దిన ప్రాంతమది. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే దేవ భూమి అది. పచ్చటి చెట్ల మధ్య ప్రశాంత జీవనం అక్కడి ప్రజల సొంతం. ఒకరోజు చిటపటలతో మొదలైన వర్షం.. వరదై.. ఏరులై... ఉప్పెనై ముంచెత్తింది. కళ్ల ముందే కలల సౌధాలను కబళించింది. ఊళ్లకు ఊళ్లను మింగేసింది. ఊహించని విధంగా విరుచుకుపడిన ప్రకృతి విపత్తు... ఇల్లూ వాకిలీ, గొడ్డూ గోదా సర్వస్వాన్ని లాగేసుకుని ప్రజలను రోడ్డున పడేసింది. బాధితులకు అండగా నిలవడానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు వేసిన తొలి అడుగును లక్షలాది మంది మానవతామూర్తులు అనుసరించారు. వారి చల్లని హృదయాలు పరచిన బాటలో అలెప్పీ జిల్లాలో 121 ఇళ్లు రూపుదాల్చాయి. బాధితుల జీవితాల్లో ఆనందాలు నింపనున్నాయి.

సర్వస్వాన్ని కోల్పోయిన వారి జీవితాల్లో 'ఈనాడు' ఆనందాలు
సర్వస్వాన్ని కోల్పోయిన వారి జీవితాల్లో 'ఈనాడు' ఆనందాలు

By

Published : Feb 9, 2020, 3:43 PM IST

ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయిన కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రామోజీ గ్రూపు సంస్థలు తలపెట్టిన మహా సంకల్పం తుది అంకానికి చేరింది. 2018 వర్షాకాలంలో కనీవినీ ఎరుగని కుంభవృష్టితో రోడ్డున పడిన బాధితుల జీవితాల్లో నేడు వెలుగులు ప్రసరించనున్నాయి. అలెప్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రామోజీ గ్రూప్‌ నిర్మించిన 121 రెండు పడక గదుల ఇళ్లను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆదివారం లబ్ధిదారులకు అందించనున్నారు. అలెప్పీలోని హోటల్‌ కేమ్లాట్‌ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి రామోజీ గ్రూపు సంస్థల తరఫున 'ఈనాడు' ఎం.డి. కిరణ్‌, మార్గదర్శి ఎం.డి. శైలజా కిరణ్‌ హాజరుకానున్నారు.

ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ... బాధితులకు నిలువ నీడ కల్పించాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ మహాక్రతువులో మహిళలు కీలక భూమిక పోషించారు. కేరళలోనే అతిపెద్ద మహిళా గ్రూప్‌ కుటుంబశ్రీకి ఇళ్ల నిర్మాణ బాధ్యత అప్పగించడంతో ఇది సాధ్యమైంది. చేయిచేయి కలిపి ముందుకు సాగిన ఇంజినీర్ల నుంచి కూలీల వరకు అంతా మహిళలే కావడం గమనార్హం. కేరళ హౌసింగ్‌ ప్రాజెక్టు తర్వాత వరద బాధితుల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు రెండో అతిపెద్దది.

ఈ మేరకు ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో... ఇళ్ల నిర్మాణంలో రామోజీ గ్రూపు భాగస్వామ్యం, బాధితులను ఆదుకున్న విధానాన్ని ముఖ్యమంత్రి విజయన్‌కు కుటుంబశ్రీ తరఫున మిషన్‌ డైరెక్టర్‌ వివరించనున్నారు. లబ్ధిదారులకు ఇళ్ల తాళం చెవులు అందించిన తర్వాత ‘'ఈనాడు' ఎం.డి. కిరణ్‌, మార్గదర్శి ఎం.డి. శైలజా కిరణ్‌లను కేరళ ప్రభుత్వం సత్కరించనుంది. ఇళ్ల నిర్మాణ ప్రాంతాల ఎంపికలో కీలక పాత్ర పోషించిన నాటి అలెప్పీ సబ్‌ కలెక్టర్‌, ప్రస్తుత కేరళ పర్యాటక అభివృద్ధి మండలి ఎం.డి. కృష్ణతేజనూ సీఎం సన్మానించనున్నారు.

నాడు సర్వం కోల్పోయిన వారికి అండగా నిలవడానికి రామోజీ గ్రూపు సంస్థల తరఫున ఛైర్మన్‌ రామోజీరావు రూ.3 కోట్లతో ‘'ఈనాడు' సహాయ నిధి’ని ఏర్పాటు చేశారు. మానవతావాదులూ ఇతోధికంగా సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు... ఇలా ఎందరో సహృదయులు తమకు సాధ్యమైనంత మేరకు విరాళాలు అందించారు. వారి దాతృత్వ హృదయాన్ని సాక్షాత్కరిస్తూ నిధి రూ.7.77 కోట్లకు చేరింది.

లబ్ధిదారుల సంతోషం...

పలు ప్రాంతాల్లో నిర్మించిన గృహాలను ‘'ఈనాడు' తెలంగాణ ఎడిటర్‌ డి.ఎన్‌.ప్రసాద్‌, మార్గదర్శి వైస్‌ ప్రెసిడెంట్‌ రాజాజీ శనివారం సందర్శించారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన తమను ‘'ఈనాడు'’ ఆదుకుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. దైవం మానుష రూపేణా అనే సూక్తికి రామోజీ గ్రూపు సంస్థలు, తెలుగు ప్రజలు చేసిన సాయం తార్కాణమని కొనియాడారు.

ఇవీ చూడండి:'గదిలో 24 రోజులు'.. మైనర్​పై మావయ్య​ అరాచకం

ABOUT THE AUTHOR

...view details