పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే మూడు నెలలు ఆలస్యమైంది. ఈ నెల 8 నుంచి జరపాలని కాలపట్టిక ప్రకటించినా... సాంకేతిక కారణాల వల్ల సాధ్యపడటం లేదు. మళ్లీ పరీక్షలు జరుపుదామంటే కరోనా ఎప్పటికి నియంత్రణలోకి వస్తుందో తెలియని పరిస్థితి. జులైలో నిర్వహిస్తామని ప్రకటిస్తే అప్పటికి తగ్గకుంటే ఎలా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒకవేళ పరిస్థితిని బట్టి పరీక్షలు జరుపుతామని ప్రకటిస్తే అప్పటివరకు విద్యార్థులు చదువుతూనే ఉండాలి. ఎప్పుడు జరుగుతాయో... అసలు జరుగుతాయో... లేదో... తెలియని అయోమయ పరిస్థితిలో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
పంజాబ్‌లో ఎలా ఇస్తున్నారో..
జూలైలో కరోనా నియంత్రణలోకి వస్తుందని కచ్చితంగా చెప్పగలిగే పరిస్థితి ఉంటే మళ్లీ పరీక్షలు జరుపుతామని చెప్పొచ్చు. అది తెలియకుండా మళ్లీ జరిపేందుకు ముందుకు వెళ్లడం కష్టమని విద్యాశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అందుకే పరీక్షలు జరపకుండా అంతర్గత మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తమ మార్గంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి గ్రేడ్లు ఇస్తున్న పంజాబ్ విధానాన్ని తెలుకోవాల్సిన అవసరం ఉందని మరో అధికారి పేర్కొన్నారు.
ఇలా చేద్దాం..
విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పేరిట ఏడాదిలో నాలుగు పరీక్షలు (ఎఫ్ఏ-1,2,3,4) నిర్వహిస్తారు. ఒక్కో పరీక్ష 20మార్కులు... మొత్తాన్ని ఐదు మార్కులకు కుదిస్తారు. ఇంకా ప్రాజెక్టు వర్క్‌కు ఐదు, అసైన్‌మెంట్‌కు 5, రాత పనికి 5 మార్కులు... మొత్తం 20 మార్కులకు ఎన్ని వచ్చాయో లెక్కించి అంతర్గత మార్కులు లెక్కిస్తారు. అలా ఒక్కో సబ్జెక్టుల్లో అంతర్గత మార్కులు 20. మిగిలిన 80 మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సబ్జెక్టులో ఎన్ని అంతర్గత మార్కులు (20కి) వచ్చాయో ప్రభుత్వ పరీక్షల విభాగం వార్షిక పరీక్షలకు ముందే అన్ని పాఠశాలల నుంచి అన్లైన్ ద్వారా తెప్పించుకుంటుంది. వాటిని 100కి పెంచితే అవే విద్యార్థులకు వచ్చిన మార్కులు. తర్వాత వాటిని గ్రేడ్లలోకి మార్చుకునేందుకు... ఇది ఒక విధానమని పలువురు సూచిస్తున్నారు.
ఇలా కూడా ఇవ్వొచ్చు..
సమ్మేటివ్ అసెస్మెంట్-1 (ఎస్ఏ) వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. వాటిని ఆయా పాఠశాలల నుంచి 15 రోజుల్లో తెప్పించుకొని ఫలితాలు ఇవ్వొచ్చు సూచిస్తున్నారు. కాకపోతే ఇది తలనొప్పి కావొచ్చు. ఎస్ఏ-1లో 50 శాతానికి మించి మార్కులు రావని చెబుతున్నారు. ఇక ప్రీ ఫైనల్‌ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే ఆ పరీక్షలకు గైర్హాజరు అయ్యే వారి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ఉత్తుత్తి పరీక్షలు కాబట్టి సీరియస్‌గా తీసుకొని రాయలేదని... వాటిని ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. అదే ఎఫ్ఏ పరీక్షలకు 20 మార్కులు ఉంటాయని ముందుగానే తెలుసు కాబట్టి తేలిగ్గా తీసుకున్నామనే మాట అనలేరని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:తెలంగాణ సీఎంవోలో కరోనా కలకలం