పుర పోరు అభ్యర్థులకు ఈసీ సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 22న 120 మున్సిపాలిటీలకు.. 10 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. పది మేయర్ పదవులు, పది ఉపమేయర్ పదవులు, 120 పురపాలక సంఘం ఛైర్మన్లు.. 120 వైస్ ఛైర్మన్ల పదవులు దక్కనున్నాయి. పురపాలక సంఘాల్లో 2,947 వార్డు సభ్యులు, నగరపాలక సంస్థల్లో 405 కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరుగుతాయి.
మహిళలకు 50%.. 1,676 పదవులు కేటాయింపు
మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు కావడం వల్ల.. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 3,352 పదవుల్లో సగం 1,676 పదవులు మహిళలను వరించనున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది. నూతన పురపాలక చట్టం మేరకు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక ఖాతా
బరిలో నిలువాలనుకున్న అభ్యర్థులు నామినేషన్‌కు ముందు రోజు.. బ్యాంకు ఖాతా తెరచి ఎన్నికల వ్యయాన్ని ఆ ఖాతా ద్వారానే నిర్వహించాలని.. ఎన్నికల నియమావళిలో ఎస్ఈసీ వివరించింది. కార్పొరేషన్‌లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు..రూ.2,500, ఇతరులు రూ.5,000 డిపాజిట్ చేయాల్సి ఉండగా.. పురపాలక సంఘాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250.. ఇతరులు రూ.2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం - సూచనలు
- వార్డు, డివిజన్ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి సంబంధిత పురపాలక, నగరపాలక సంస్థలో ఓటరుగా ఉండాలి.
- ప్రతిపాదించే వ్యక్తి మాత్రం ఆ వార్డులో ఓటరై ఉండాలి.
- 21 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు అర్హులు.
- మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్‌గా ఉండకూడదు. మున్సిపల్ ఆస్తులను లీజులు తీసుకోకూడదు. పురపాలికకు బకాయిలు ఉండరాదు.
- మున్సిపాలిటీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు చేపట్టకూడదు.
- దివాలా తీసిన (అప్పు తీర్చలేని) వ్యక్తిగా ప్రకటించుకున్న వారు పనికిరారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులు.
- గతంలో పోటీ చేసి ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకు ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించి ఉండకూడదు. అనర్హత గడువు ముగియకున్నా పోటీ కుదరదు.
- నాలుగు కంటే ఎక్కువ నామినేషన్లు వేయకూడదు. ప్రతి నామినేషన్ పత్రంపై సంబంధిత వార్డు నుంచి ఒక ఓటరు ప్రతిపాదకుడిగా సంతకం చేయాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్ విధిగా జత చేయాలి.
- నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి రూ.20 స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌ను నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించాలి.
- ఒకటికంటే ఎక్కువ నామినేషన్లు వేసినా ఒక దానికి డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.
- పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు రిటర్నింగ్ అధికారికి బీఫారం అందజేయాలి.
- ఒక అభ్యర్థి ఒకటికంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయకూడదు. వేర్వేరు వార్డుల్లో నామినేషన్లను దాఖలు చేసినా ఒక వార్డులో మినహా ఇతర నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. రెండు అంతకంటే ఎక్కువ వార్డుల్లో పోటీలో ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు.
ఇవీ చూడండి:కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన