ఎంసెట్‌ను జూన్ నెలాఖరులో నిర్వహించాలని గతంలో ఓ నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. తాజా పరిస్థితుల నేపథ్యంలో జులై మొదటి లేదా రెండో వారంలో జరపాలని భావిస్తోంది. ఇంటర్ పరీక్షలు మే 7వ తేదీతో ముగియాల్సి ఉండగా.. తాజాగా సవరించిన కాలపట్టిక ప్రకారం మే 19న పూర్తవుతాయి. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు 45 రోజుల వ్యవధి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారం చూస్తే జులై మొదటి వారంలో ఎంసెట్‌ను నిర్వహించాలని యోచిస్తున్నారు. మరోవైపు జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఉన్నందున ఎంసెట్‌ను మొదటి వారంలో నిర్వహిస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందేమోనని అధికారులు భావిస్తున్నారు.
EAMCET Exam 2022 : జులై రెండో వారంలో ఎంసెట్! - జులైలో ఎంసెట్ పరీక్ష
ఎంసెట్‌ను జులై మొదటి లేదా రెండో వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇంటర్ పరీక్షలు, జేఈఈ పరీక్షల తేదీల వెసులుబాటును పరిశీలించి జులై రెండో వారంలోపు ఎంసెట్‌ను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యామండలి అధికారులు ఉన్నారు.
అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఎంసెట్‌ను సునాయాసంగా రాస్తారని, ప్రత్యేకంగా సిద్ధం కావాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బైపీసీ విద్యార్థులు జూన్‌లోనే నీట్ రాసి ఉంటారని, వారికి కూడా ఎంసెట్ అగ్రికల్చర్‌కు ప్రత్యేకంగా వ్యవధి అవసరం లేదని వారు సూచిస్తున్నారు. తేదీల వెసులుబాటును పరిశీలించి జులై రెండో వారంలోపు ఎంసెట్‌ను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యామండలి అధికారులు ఉన్నారు.
పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు రాసే ఈసెట్‌ను జూన్ నెలాఖరులో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన పదో తరగతి పరీక్షల తేదీల ప్రకారం పాలిసెట్‌ను జూన్ 10న జరపాలని ప్రాథమికంగా నిర్ణయించిన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తాజాగా దాన్ని జూన్ 29 లేదా 30న జరపాలని భావిస్తోంది. సవరించిన కాలపట్టిక ప్రకారం మే 28న 10వ తరగతి ప్రధాన పరీక్షలు ముగుస్తాయి.