తెలంగాణ

telangana

ETV Bharat / city

కొవిడ్​పై యుద్ధానికి భారీగా విరాళాలు

కరోనా నియంత్రణ చర్యల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు... స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధారణ పౌరులు ముందుకొస్తున్నారు. కొవిడ్ 19 బారినపడ్డ వారికోసం వివిధ రూపాల్లో చేయూత నందిస్తున్నారు. తమవంతు సహకారంగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నారు.

donations for chief minister relief fund fight on corona
కొవిడ్​పై యుద్ధానికి భారీగా విరాళాలు

By

Published : Mar 28, 2020, 5:46 AM IST

కొవిడ్​పై యుద్ధానికి భారీగా విరాళాలు

ఖమ్మంలో కరోనా నివారణకు పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయం చేస్తున్నాయి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష రూపాయల విలువైన 4500 మాస్క్‌లను ట్రాఫిక్ పోలీసులకు పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. నగరపాలక సంస్థకు చెందిన గుత్తేదారులు లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళమిచ్చారు. సత్తుపల్లిలో 14 లక్షల 85 వేల సేకరించినట్టు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ 19 వార్డుకు అవసరమయ్యే పరికరాలు, మందుల కొనుగోలుకు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ కోటి రూపాయలు విరాళమిచ్చారు. ఎంపీ పసునూరి దయాకర్ ఎంపీ లాడ్స్‌ నుంచి 5 కోట్ల రూపాయలు, రెండు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 50 లక్షలు ప్రకటించారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నెల జీతంతో పాటు... నియోజకవర్గ నిధుల నుండి 3 కోట్ల రూపాయలు అందించారు. కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు రెండు రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నట్టు ప్రకటించారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సాయంగా టీఎన్​జీవో అధ్యక్షుడు పొన్న మల్లయ్య దంపతులు నెల వేతనం అందించారు. మామడ మండలం రాయదారి గ్రామానికి చెందిన దంపతులు లక్ష రూపాయలు, నిర్మల్‌కు చెందిన తెరాస నాయకుడు శ్రీహరిరావు లక్ష విలువ గల చెక్కును అందజేశారు. నల్గొండలో ఇండియన్​ రెడ్ క్రాస్ సభ్యులు తమ వంతు సాయంగా వెయ్యి మాస్కులు పంపిణీ చేశారు.

కరోనాను ఎదుర్కొనేందుకు ఒక రోజు మూల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు RTC తెలంగాణ మజ్దూర్ యూనియన్ ముందుకొచ్చింది. ఉద్యోగులందరూ ఒక రోజు మూల వేతనం అందించాలని నిర్ణయించింది. అపర్ణ కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్ ఉదయ్ రెడ్డి రెండు కోట్ల రూపాయలు, కోహినూర్ గ్రూప్స్ సంస్థ కోటి రూపాయల విరాళంగా ప్రకటించింది.

ఇదీ చూడండి:ప్రజలు ఆకలితో అలమటించొద్దు: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details