సిద్ధాంతకర్తలు ఏం సూత్రీకరించారు?
"స్త్రీని భయభ్రాంతులకు గురిచేసి.. బెదిరించి.. పురుషుడు పూర్తి స్పృహతో చేసే అకృత్యమే అత్యాచారం. ఈ దుశ్చర్యలో బాధితురాలిని నిందించడంలో అర్థంలేదు."
- స్త్రీవాద రచయిత సుశాన్ బ్రౌన్ మిల్లర్ (1975లో రాసిన ‘ఎగనెస్ట్ అవర్ విల్’ పుస్తకంలో)
"రేపిస్టులందరికీ మూడు ఉద్దేశాలు ఉంటాయి. 1.పరపీడన కాముకత్వం(శాడిజం), 2. ఉద్రేకం. 3. ఆధిపత్యాన్ని ప్రదర్శించు కోవాలన్న కోరిక. అత్యాచారం అన్నది సంపూర్ణ మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి చేసేది కాదు. తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మానసిక స్థిరత్వం లేని వ్యక్తే ఈ దారుణానికి ఒడిగడతాడు."
- క్లినికల్ సైకాలజిస్ట్ నికోలస్ గ్రోత్ (మెన్ హూ రేప్ అనే పుస్తకంలో- 1976)
మీకు తెలుసా?
- 90% అత్యాచార ఘటనలు బాగా తెలిసిన వారు, పరిచితులు పాల్పడుతున్నవే. ఈ కేసుల్లో దాదాపు 25% బయటపడటం లేదు. తాము చెప్పినా ఎవరూ నమ్మరేమోనన్న భయంతో చాలామంది మహిళలు, పిల్లలు బయటికి చెప్పడం లేదు.
- అత్యాచారాలు కాకతాళీయంగా సంభవించేవేం కాదు. పథకం ప్రకారం జరుగుతున్నవే ఎక్కువ.
- అత్యాచార బాధితురాలికి గాయాలు, దెబ్బల్లాంటివి తగిలితేనే చికిత్స అవసరం అనుకోవటం తప్పు. ఒంటిమీద గాయాల్లేకున్నా.. మానసిక గాయాలకూ చికిత్స అవసరం.
నిస్సహాయులే లక్ష్యం
రేపిస్టులు సాధారణంగా నిస్సహాయుల్ని, ఒంటరివారిని, చిన్న పిల్లల్ని లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. చిన్నపిల్లలకు లైంగిక చర్యల పట్ల అవగాహన ఉండదు కాబట్టి.. దాని తీవ్రతను వారు గుర్తించలేరు. ఎదిరించలేరు. చాక్లెట్లో, బొమ్మలో ఇచ్చి తేలిగ్గా లొంగదీసుకోవచ్చనుకుంటారు. పైగా అత్యాచారం జరిగినా దాన్ని వారు గుర్తించలేరు. అందుకే రేపిస్టుల్లో ఎక్కువమంది చిన్నపిల్లల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారిలో చాలామంది పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చే అత్యాచార వార్తలను నిశితంగా గమనిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఒక్కో రేపిస్టుది ఒక్కో తీరు...
1 ఆధిపత్య ధోరణి
తనలో పేరుకుపోయిన న్యూనత భావనల్ని అధిగమిస్తూ.. తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి కొందరు ప్రవర్తిస్తారు. గొప్పతనం లేదా బలప్రదర్శన కోసం అత్యాచారాన్ని(పవర్ రేప్) ఒక మార్గంగా ఎంచుకుంటారు.
2 ఆగ్రహపూరితం
లైంగిక వాంఛలు తీర్చుకోవడం కన్నా కూడా.. ప్రాథమికంగా స్త్రీని అవమాన పరిచి, గాయపరచి తృప్తిచెందడం ఈ ‘యాంగర్ రేప్’ ప్రత్యేకం. వీరిలో శారీరకంగా హింసించటం, దుర్భాషలాడటం.. ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. వీళ్లకు సెక్స్ అన్నది పరువుతీసే ఆయుధం. వీళ్లలో స్త్రీ ద్వేషులూ ఉంటారు.
3 పైశాచికం
స్త్రీని హింసిస్తూ.. ఊహా లోకాల్లో విహరిస్తూ... వాళ్ల బాధను చూస్తూ కామోద్రేకం పొందటం. స్త్రీలు బాధపడుతున్న కొద్దీ సంతోషించటం ఈ ‘శాడిస్టిక్ రేప్’ లక్షణం. స్త్రీని వీరు భోగ వస్తువుగానే చూస్తుంటారు.