Farmer loan waiver: రూ.50 వేలలోపు మాత్రమే మాఫీ - హైదరాబాద్ తాజా వార్తలు
16:04 August 15
Farmer loan waiver: రూ.50 వేలలోపు మాత్రమే మాఫీ
రెండో దఫా రుణమాఫీలో 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 50 వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని ఆయన చెప్పారు. 25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇందుకోసం ఇవాళ్టి నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 25 వేల పైబడి 25,100 రూపాయల వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ జరుగుతుందని అన్నారు. 25వేలు, 26వేలు, 27వేలు స్లాబుల వారీగా రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.
నెలాఖరు వరకు 2005 కోట్లా 85 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. రేపట్నుంచి రుణమాఫీ మొదలు కానున్న నేపథ్యంలో రైతులోకానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 2014 నుంచి 18 వరకు 16,144 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయని అన్నారు. 2018లో 25 వేలలోపు రుణాలున్న 2.96 లక్షల మంది రైతులకు 408.38 కోట్ల మేర మాఫీ అయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపిన నిరంజన్ రెడ్డి... సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగానికి సీఎం ఆసరాగా నిలిచారని అన్నారు. ఆకలితో అలమటించిన తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపారని మంత్రి తెలిపారు. పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి:'నవ భారత్ కోసం రూ.100 లక్షల కోట్లతో ప్రగతి యజ్ఞం'