తెలంగాణ

telangana

ETV Bharat / city

మరోసారి తెరపైకి డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌.. - Telangana Municipal Department Chief Secretary Arvind Kumar

‘‘పాషాబాయ్‌కి దుకాన్‌ ఆకే పూచో.. సలీమ్‌ లాలా కిదర్‌ రెహ్తే.. సీదా ఘర్‌ తక్‌ లాకే చోడ్‌తే..’’ అంటూ చార్మినార్‌ ప్రాంత చిరునామాతో ఓ వినియోగదారుడు ఓ డెలివరీ సంస్థకు ఇచ్చిన చిరునామా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిపై ఆదివారం మంత్రి కేటీఆర్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ స్పందించారు.

digital-door-numbering-in-hyderabad
హైదరాబాద్​లో డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌

By

Published : Jan 18, 2021, 9:45 AM IST

‘‘గొప్ప హైదరాబాదీ చిరునామాలు..!! క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌ వ్యవస్థ తీసుకొచ్చేందుకు మేం ప్రణాళిక రూపొందిస్తున్నాం..’’ అంటూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి చేసిన ట్వీట్‌.. డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌ అంశాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చింది. ఏళ్లుగా ఇది కార్యరూపం దాల్చట్లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మహానగరం ఏటికేడు విస్తరిస్తోంది. కొత్త గల్లీలు.. కొత్త ఇళ్లు.. పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ ఇరుకు గల్లీల్లో ఓ ఇల్లు ఎక్కడుందో కనుక్కోవాలంటే.. చేతిలో ఇంటి నంబరున్నా పట్టపగలు చుక్కలు చూడాల్సిందే.. అంతా గజిబిజీ.. ఇక పాత బస్తీలాంటి చోట్లయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని రంగాల్లోనూ ఆధునికత, సాంకేతికతతో కొత్త హంగులద్దుకుంటోన్న నగరం.. ఇంటి చిరునామా గుర్తింపు విధానంలో మాత్రం బాలారిష్టాలను దాటలేకపోతోంది. రెండు ఇళ్ల మధ్య కొత్త ఇళ్లు కడితే దానికి ఇచ్చే నంబరింగ్‌ అస్తవ్యస్తంగా ఉండటం..పాతకాలం నుంచి కొనసాగుతోన్న అశాస్త్రీయ వ్యవస్థనే ఏళ్లుగా కొనసాగిస్తుండటం చిరునామా వెతుక్కుంటూ వచ్చే కొత్త వారికే కాదు జీహెచ్‌ఎంసీ కిందిస్థాయి సిబ్బందికీ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీన్ని మార్చేందుకు డిజిటల్‌ డోర్‌ నంబర్‌ (డీడీఎన్‌) వ్యవస్థ ప్రతిపాదనలు తెచ్చినా.. అది కార్యరూపం దాల్చలేకపోతోంది. అయితే ఆదివారం ఓ ట్వీట్‌ మరోసారి డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

ఆరంభశూరత్వమే..!

గత పదేళ్లుగా డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌ విధానం మాట వినిపిస్తోంది. ఐదేళ్లకోసారి తెరమీదకు తీసుకొచ్చి హడావుడి చేసి వదిలేస్తున్నారు. మొదట 2010లో బాగ్‌లింగంపల్లిలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించినా పలు సమస్యలతో ఆగిపోయింది. తిరిగి 2015లోదోమలగూడ, గంగామహల్‌ ప్రాంతాల్లో ప్రాంభించినా, వాటిని వినియోగించే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారు.

అస్తవ్యస్తంగా నంబరింగ్‌..!

1986లో అప్పటి వార్డు నంబర్ల ఆధారంగా ఇచ్చిన ఇంటి నంబర్ల విధానమే నేటికీ కొనసాగుతూ వస్తోంది. తర్వాత పెరిగిన ఇళ్లు, మారిన వార్డులతో పలు ప్రభుత్వ పథకాల పంపిణీ, ఇళ్ల గుర్తింపు.. క్షేత్ర స్థాయి సిబ్బందికి సవాలుగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి గతేడాది రాష్ట్ర మున్సిపల్‌శాఖ ముందడుగు వేసింది. ఇప్పటికే దిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పాటు ఏపీలో విజయవాడ, ఇతర పట్టణాల్లోనూ అమల్లో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ నంబరింగ్‌ వ్యవస్థను అమలు చేసేందుకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ కమిటీని నియమించారు. దీనికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ను ఛైర్మన్‌గా నియమించారు. ఆయన నేతృత్వంలో పలువురు అధికారులకు కమిటీలో స్థానం కల్పించారు. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌, జాతీయ పట్టణ నిర్వహణ నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా సిబ్బంది.. ఇలా వివిధ అంశాల్లో నిష్ణాతులైన వారు ఉన్నారు. ఇప్పటికీ ఈ అంశం కార్యరూపం దాల్చలేదు.

ABOUT THE AUTHOR

...view details