తారస్థాయికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇంటలిజెన్స్, ఎస్బీ నుంచి సేకరించిన సమాచారాన్ని బేరీజు వేసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు... కొన్ని విధ్వంసక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే ప్రమాదముందని అంచనా వేశారు. డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లతో పాటు.. శాంతిభద్రతల అదనపు డీజీపీ, తూర్పు, పశ్చిమ ఐజీలతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బందోబస్తుపరంగా తీసుకుంటున్న చర్యల గురించి అంజనీ కుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్ వివరించారు. ముఖ్యంగా రౌడీషీటర్లు, అల్లరి మూకలను బైండోవర్ చేసినట్లు సీపీలు డీజీపీకి తెలిపారు.
ప్రజాశ్రేయస్సు దృష్ట్యా బయటపెట్టలేం..
హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని కొన్నిచోట్ల అల్లర్లు, మతఘర్షణలు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందని.. దీన్ని ముందుగానే అరికట్టేందుకు సిద్ధంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి సీపీలను ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలను మహేందర్ రెడ్డి వివరించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసి... ప్రజల మనోభావాలను దెబ్బతీసి అల్లర్లు సృష్టించేలా కొంతమంది కుట్ర పన్నుతున్నారన్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ... ప్రజాశ్రేయస్సు దృష్ట్యా బయటపెట్టలేమని.. మత ఘర్షణలను నిరోధించడానికి పోలీస్ శాఖ పూర్థిస్థాయిలో సన్నదమై ఉందని మహేందర్ రెడ్డి తెలిపారు.