తెలంగాణ

telangana

ETV Bharat / city

AP DGP ON MAHA PADAYATRA : అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి..కానీ! - Representatives of the Amravati Conservation Committee

ఏపీలోని అమరావతి రైతులు చేయనున్న మహాపాదయాత్ర (AP DGP ON AMARAVATHI FARMERS MAHA PADAYATRA)కు ఎట్టకేలకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే అనేక షరతులు విధించారు.

DGP ON AMT PAADAYATRA
DGP ON AMT PAADAYATRA

By

Published : Oct 31, 2021, 9:15 AM IST

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు నవంబర్​ 1నుంచి తుళ్లూరు నుంచి తిరుమల వరకు చేపట్టిన మహాపాదయాత్ర (AP DGP ON AMARAVATHI FARMERS MAHA PADAYATRA)కు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శనివారం అనుమతిచ్చారు. అదే సమయంలో పలు ఆంక్షలూ విధించారు.

ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యే పాదయాత్ర నిర్వహించాలని స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టుకు సమర్పించిన జాబితాలోని 157 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని, వారంతా గుర్తింపుకార్డులు ధరించాలని తెలిపారు. ఒకటి లేదా రెండు పోర్టబుల్‌ హ్యాండ్‌మైక్‌లు మాత్రమే వినియోగించాలన్నారు. డీజే సౌండ్‌ సిస్టమ్స్‌ను వినియోగించడం, డీజే గ్రూప్స్‌ పాల్గొనడం నిషిద్ధమని స్పష్టం చేశారు.

పాదయాత్రికులు రోడ్డు పక్కనే నడవాలని, రోడ్డును ఆక్రమించి ట్రాఫిక్‌కు అవరోధం కలిగించరాదని స్పష్టం చేశారు.

డీజీపీ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన మరిన్ని నిబంధనలు, ఆంక్షలు..

  • పాదయాత్ర చేసేవారికి ఇతర వ్యక్తులు, బృందాలు, సంస్థలు స్వాగత కార్యక్రమాలు నిర్వహించడం, భారీ సమూహంతో ఎదురేగి తోడ్కొని వెళ్లడం వంటివి నిషిద్ధం.
  • పాదయాత్రికులు మార్గమధ్యలో ఏ గ్రామంలోనూ, పట్టణంలోనూ బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ప్రసంగాలూ నిషిద్ధమే.
  • మీడియా ప్రతినిధులు పాదయాత్ర వెంట కొనసాగాల్సిన అవసరం లేదు. నిర్వాహకులు కావాలనుకుంటే, వారు విశ్రాంతి కోసం ఆగేచోట ఒక క్రమపద్ధతిలో మీడియాకు వివరాలు వెల్లడించవచ్చు.
  • వేంకటేశ్వరస్వామి ప్రతిమ ఉన్న వాహనం, అంబులెన్స్‌, ఆహార పదార్థాల్ని తీసుకెళ్లేది, బయోటాయిలెట్స్‌ ఉన్నది తప్ప మరే ఇతర వాహనం యాత్రలో పాల్గొనడానికి వీల్లేదు.
  • నిర్వాహకులు సమర్పించిన రూట్‌ను, షెడ్యూల్‌ను ముందస్తు సమాచారం ఇవ్వకుండా మార్చకూడదు.
  • పాదయాత్రికులు తాము వెళ్లే మార్గంలోని గ్రామాలు, పట్టణాల్లో.. జాతీయ రహదారులు, రోడ్లు, వీధుల్లో ఇతరులకు ఎలాంటి అవరోధాలు, అసౌకర్యం కలిగించకూడదు.
  • కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున మాస్క్‌లు ధరించడం, శానిటైజర్‌ వినియోగించడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలన్నీ పాటించాలి.
  • ఆయుధాలు గానీ, లాఠీలు గానీ ధరించకుండా శాంతియుతంగా పాదయాత్ర చేయాలి. ఎలాంటి హింసాత్మక, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడరాదు.
  • ఏకైక రాజధాని డిమాండ్‌ను వ్యతిరేకించే వర్గాలతో పాదయాత్రికులు ఎక్కడా ఘర్షణలకు దిగకుండా నిర్వాహకులు బాధ్యత వహించాలి.
  • ఏ వ్యక్తుల్నీ, అధికారుల్నీ, సంస్థల్ని ఉద్దేశించి దుందుడుకుగా, రెచ్చగొట్టేలా మాట్లాడటం నిషిద్ధం.
  • పెండింగ్‌లో ఉన్న నగరపాలక, పురపాలక సంఘాలకు ఎన్నికల తేదీలు ప్రకటిస్తే.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న ప్రాంతాల మీదుగా వెళ్లేటప్పుడు కచ్చితంగా ఆ నిబంధనల్ని పాటించాలి.
  • బాణసంచా వినియోగం పూర్తిగా నిషిద్ధం. రోడ్లపై చెత్త వేయకూడదు.
  • తిరుమలకు చేరుకున్న తర్వాత అక్కడ అమల్లో ఉన్న నిబంధనల్ని, తితిదే నిర్దేశించిన సంప్రదాయాల్ని, పద్ధతుల్ని విధిగా పాటించాలి.
  • నిబంధనల్లో వేటినైనా ఉల్లంఘిస్తే కోర్టుకు తెలియజేయడంతోపాటు, అనుమతి రద్దు

ఎస్పీలు వీడియో రికార్డింగ్‌ చేయించాలి...

పాదయాత్ర చేస్తున్నవారికి ఆయా జిల్లాల్లో పోలీసు రక్షణ కల్పించాలని, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని గుంటూరు నగర, గ్రామీణ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి నగర ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్ర పొడవునా వీడియో చిత్రీకరణ చేయించాలన్నారు. శాంతిభద్రతల నిర్వహణకు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు స్థానిక పరిస్థితుల్నిబట్టి తగు నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details