తిరుమల(Tirumala) శ్రీవారి సర్వదర్శనం కోసం సామాన్య భక్తులు ఆశగా నిరీక్షిస్తున్నారు. కరోనా మొదటి దశ సమయంలో గతేడాది మార్చి 20 నుంచి జూన్ 8వ తేదీ వరకు దాదాపు 80 రోజుల పాటు భక్తులకు దర్శనాలను నిలిపివేసి శ్రీవారి కైంకర్యాలను తితిదే ఏకాంతంగా నిర్వహించింది. కరోనా రెండో దశ ప్రభావంతో ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు సర్వదర్శనం టికెట్లను జారీ చేయలేదు. దీంతో పేద, సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు.
కరోనా భయంతో...
ఇదే సమయంలో ఆన్‌లైన్‌లోనూ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తితిదే తగ్గించింది. మే నెలలో రోజుకు 15వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేసింది. వాటిని భక్తులు కొనుగోలు చేసినప్పటికీ కరోనా భయంతో దర్శనాలకు రాలేకపోయారు. దీంతో తితిదే జూన్‌లో ఈ టికెట్లను రోజుకు ఐదువేలకే పరిమితం చేసింది. జులైలోనూ అదే సంఖ్యలో దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తోంది.