- నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వాసి ఒంటరి నర్సారెడ్డి సౌదీ అరేబియాలోని రియాద్‌లో నవంబరు 1న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆ సమాచారం తెలిసి తల్లి నర్సవ్వ, భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. శవం వస్తే చివరిచూపు చూడాలని భావించారు. విదేశాంగ, పాస్‌పోర్టు అధికారులను వేడుకున్నారు. హైకోర్టునూ ఆశ్రయించారు. నానా ప్రయాసల అనంతరం అయిదు నెలల తర్వాత మృతదేహం స్వగ్రామానికి చేరింది.
- కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఉయ్యాల పరశురాములు 2020 మే 13న దుబాయ్‌లో మరణించారు. ధ్రువీకరణ పత్రాలు లేనందున శవాన్ని తరలించడం సాధ్యం కాదంటూ అక్కడే అంత్యక్రియలు పూర్తిచేసిన ప్రభుత్వం ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇంటికి పంపింది. నిర్జీవంగానైనా చూసే అవకాశం దక్కలేదంటూ కుటుంబసభ్యులు మానసిక క్షోభకు గురయ్యారు.
ఈ రెండు కుటుంబాలే కాదు.. గల్ఫ్‌లో మరణించే తెలంగాణ కార్మికుల కుటుంబాలన్నింటిదీ ఇదే పరిస్థితి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో దేశంగానీ దేశం వెళ్లి దురదృష్టవశాత్తూ అసువులు బాసిన కార్మికుల చివరి చూపు కోసం కుటుంబ సభ్యులకు నానా యాతనలు తప్పడం లేదు.
గల్ఫ్‌లోని యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఖతార్ దేశాల్లో కరోనా కంటే ముందు ప్రతిరోజూ 10 నుంచి 15 మంది భారతీయులు కన్నుమూసేవారు. కరోనా తొలి దశ తర్వాత లక్షల మంది స్వదేశానికి తిరిగిరాగా, అతి తక్కువ మంది అక్కడికి వెళ్తున్నారు. ఎన్నో ఆటంకాలు అధిగమించి గల్ఫ్ చేరినా ఉద్యోగం దొరకడం కష్టమే. వేతనాలు పొందడానికీ ఇబ్బందులే. ఉద్యోగాలు పోతే అక్రమంగా నివసించాలి. ఈ పరిస్థితుల్లో గల్ఫ్‌లో కార్మికులు తీవ్ర భయాందోళనల మధ్య జీవిస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. స్వగ్రామాల్లో కుటుంబాల నుంచి ఒత్తిళ్లు, సమస్యల కారణంగానూ కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రమాదాలు, హత్యల వల్లా చనిపోతున్నారు. భారత విదేశాంగ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం 2014 నుంచి 2020 వరకు 3,500 మంది భారతీయులు గల్ఫ్‌లో మరణించారు. వారిలో తెలంగాణ వారు 1300 మందికిపైగా ఉన్నారు. పరిస్థితి దుర్భరంగా ఉన్నా, మృతదేహాల తరలింపు సమస్యకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదనే విమర్శలున్నాయి.
మృతదేహాల కోసం ఎదురుచూపులు
గల్ఫ్‌లో మరణించిన తర్వాత మృతదేహాలను స్వదేశానికి తరలించడం అతిపెద్ద సమస్యగా పరిణమించింది. సౌదీలో నిబంధనలు మరీ కఠినతరంగా ఉంటాయి. ఎవరైనా చనిపోతే శవపరీక్ష, విచారణ, దర్యాప్తులు.. ఇలా అనేక కారణాలతో ఆరు నెలల సమయం పడుతుంది. ఈలోగా తరలింపు సాధ్యం కాకపోతే ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు అక్కడే అంత్యక్రియలు చేసేస్తున్నాయి.
ఎన్నో కారణాలు
రాష్ట్రం నుంచి వెళ్లిన వారికి వీసాలు, పాస్‌పోర్టులు లేకపోవడం మృతదేహాల తరలింపునకు ప్రధాన అడ్డంకిగా మారింది. స్థానికంగా పేర్లు నమోదు కాకపోవడం, ఎలాంటి ధ్రువీకరణలు లేకపోవడం, విదేశాంగ శాఖ నుంచి సత్వరం సమాచారం రాకపోవడం, మరణాలకు కారణాలు.. సాక్ష్యాలు లేకపోవడం తదితరాలతో శవ పంచనామాల్లో జాప్యం జరుగుతోంది. ఈ సమయాల్లో రాయబార కార్యాలయాలు స్వదేశంలోని మృతుని బంధువుల నుంచి సమాచారం తీసుకొని అందించిన తర్వాత ఆ ప్రక్రియ పూర్తవుతోంది. తర్వాత స్థానిక రాయబార కార్యాలయం అధికారుల అఫిడవిట్‌తో గల్ఫ్ దేశాల నుంచి నిరభ్యంతర పత్రం జారీ అవుతుంది.
ఖర్చూ అధికమే..
నిబంధనల ప్రకారం మృతదేహాలను విమానంలో తరలించాలి. ఒక ప్రయాణికుడి వెంట దానిని కార్గో టికెట్‌పై పంపించాలి. చాలా మంది ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లడానికి ముందుకు రావడం లేదు. ఆయా దేశాల్లో ఎవరైనా మృతిచెందితే మృతదేహాలను నిల్వచేసే ఫ్రీజర్‌లు, ప్యాకింగ్, కార్గో రుసుం తదితరాలకు రూ. 1.50 లక్షల నుంచి రూ.2 లక్షల మేరకు చెల్లించాలి. రాయబార కార్యాలయాలు చెల్లించలేని పక్షంలో మృతుడి కుటుంబీకులు, స్నేహితులు వీటిని చెల్లించాలి. ఈ మొత్తాన్ని చెల్లించలేక కుటుంబీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరోనా విషాదం
ప్రస్తుతం కరోనాతోనే ప్రవాస కార్మికులు పలువురు మృతి చెందుతున్నారు. వ్యాప్తి భయం దృష్ట్యా వారి మృతదేహాలను స్థానికంగానే ఖననం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు.