తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆమెను చంపితేనే "సుఖం"..!

ఇంట్లోనే కుమార్తెతో మరో వ్యక్తి సాన్నిహిత్యంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక నిలదీయడమే ఆమె పాలిట శాపమైంది. ఇకపై ఇలాంటివి సహించనని ఖరాఖండిగా చెప్పడమే ఆమెకు మరణ శాసనాన్ని రాసింది.

ఆమెను చంపితేనే సుఖం!

By

Published : Oct 31, 2019, 9:16 AM IST

Updated : Oct 31, 2019, 9:50 AM IST

హైదరాబాద్​ హయత్‌నగర్‌ పీఎస్​ పరిధి మునగనూరులో ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కీర్తి ఉదంతంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తల్లి ముఖంపై కుమార్తె దిండు అదిమిపెట్టగా, ప్రియుడు చున్నీ బిగించి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి అత్యాచారం చేయడం వల్లనే కీర్తి గర్భం దాల్చిందని నిర్ధారణయింది.

ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా..
రజిత ఈ నెల 19న కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికొచ్చే సరికి ఇంట్లో కుమార్తె కీర్తి, శశికుమార్‌ సన్నిహితంగా ఉండటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? అంటూ కుమార్తెపై చేయి చేసుకుంది. ‘‘రెండు సార్లు ఇంటికొచ్చి గొడవ చేసినా నువ్వు మారలేదు. ఇంకోసారి ఇటువైపు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ’’ శశికుమార్‌నూ హెచ్చరించింది. ఆ కోపంతో బయటికెళ్లిన అతను కారులో సమీపంలోని మద్యం దుకాణానికెళ్లి మద్యం కొనుగోలు చేసి తిరిగొచ్చాడు. ఫోన్‌ చేసి ప్రియురాలిని రమ్మన్నాడు.

మీ అమ్మ బతికి ఉంటే ఆస్తి, సుఖం దక్కవు
ఆమె వచ్చిన తర్వాత అతను కారులోనే కూర్చొని మద్యం తాగాడు. ‘మీ అమ్మ బతికి ఉంటే ఆస్తి దక్కదు. నీ జీవితంలో సంతోషం అనేదే ఉండదు’ అంటూ లేనిపోనివి నూరిపోశాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఇద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానని, మొదటి ప్రియుడు బాల్‌రెడ్డికీ పంపుతానని బెదిరించాడు. అలా తల్లి హత్యకు సహకరించేలా ఆమెను ఒప్పించాడు. ‘

హత్య జరిగిన తీరు...
అప్పటికే తల్లిపై కాస్త ద్వేషం పెంచుకుని ఉన్న యువతి ఆమెను అంతమొందించేందుకు ఒప్పుకుంది. ప్రణాళిక ప్రకారం హత్య చేసిన తర్వాత చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లుగా చిత్రీకరించాలనుకున్నారు. సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి తాళం వేసి వెళ్లిపోయారు’’ అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. మృతదేహాన్ని ఏం చేద్దామంటూ రెండ్రోజుల పాటు ఇద్దరూ ఫోన్లు, వాట్సాప్‌ సంభాషణల్లో మదనపడ్డారు. 22న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన కీర్తి.. ప్రియుడిని అప్రమత్తం చేసింది. అదే రోజు అర్ధరాత్రి ఇద్దరూ కారులో మృతదేహాన్ని తీసుకుని ప్రధాన రహదారిపై కాకుండా బాహ్యవలయ రహదారి సర్వీస్‌ రోడ్డుపై బయలుదేరారు. ఆత్మహత్యగా చిత్రీకరించే క్రమంలో రామన్నపేట వద్ద రైలు పట్టాలపై మృతదేహాన్ని పడేశారు.


అత్యాచారం చేశాడు... గర్భం దాల్చింది..!
బాల్‌రెడ్డి జనవరిలో కీర్తిపై అత్యాచారానికి పాల్పడినట్టు, తత్ఫలితంగానే ఆమె గర్భం దాల్చినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఆందోళనకు గురైన ఆమె గర్భస్రావం చేయించాలంటూ బాల్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చింది. శశికుమార్‌ సాయంతో బాల్‌రెడ్డి, కీర్తి... ఎల్బీనగర్‌ సహారాలో ఉండే ఓ వైద్యుడిని సంప్రదించారు. ఆయన సూచన మేరకు ఆమనగల్‌లోని ఆసుపత్రికి ముగ్గురూ వెళ్లారు.
హయత్‌నగర్‌ పోలీసులు గర్భస్రావం ​ చేసిన సదరు వైద్యుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

మృతదేహం తరలింపులో మూడోవ్యక్తి ప్రమేయం...?

ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న శశికుమార్‌ ఆమెను లోబర్చుకున్నాడని దర్యాప్తులో వెల్లడైందని తెలిసింది. మరోవైపు మృతదేహం తరలింపులో మూడో వ్యక్తి ప్రమేయం ఉందా? అని తేల్చేందుకు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: తల్లిని హత్య చేసిన కేసులో దర్యాప్తు వేగవంతం

Last Updated : Oct 31, 2019, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details