Dalit Bandhu Vehicles: రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో మంజూరైన వాహనాలు దళారులు, అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దళితబంధు పథకం కింద ఇచ్చే వాహనం, యంత్రాల క్రయవిక్రయాలపై అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. వాటన్నింటినీ ఎస్సీ కార్పొరేషన్‌కు తాకట్టులో పెట్టనుంది. దళితబంధు కింద పొందిన వాహనాలను లబ్ధిదారులు భారీ సంఖ్యలో విక్రయిస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల తరువాత కూడా లబ్ధిదారు జిల్లా కలెక్టరు నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుంటేనే వాహన విక్రయానికి రవాణాశాఖ అనుమతించనుంది. రాష్ట్రంలో దళితబంధు పథకం కింద ఇప్పటివరకు 26 వేల యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్క హుజూరాబాద్‌లోనే 17 వేల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు కార్లు, టిప్పర్లు, జేసీబీలు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. గతంలో సంక్షేమ పథకాలు మంజూరైనప్పుడు కొందరు అక్రమార్కులు, దళారులు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకే యూనిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల ఆర్థిక అవసరాలు, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వాటిని పక్కదారి పట్టించారు. దళితబంధు పథకంలో ఈ సమస్యలు రాకుండా ఉండాలని ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబం రూ.10 లక్షల యూనిట్‌తో ఆర్థిక స్వావలంబన సాధించాలన్న లక్ష్యంతో పథకం ప్రవేశపెట్టినందున లబ్ధిదారులు మంజూరైన యూనిట్లతో ఆదాయం పొందేలా నిబంధనలు చేర్చింది.
క్షేత్రస్థాయిలో పరిశీలనలు..మరోవైపు దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని అధికారులు పరిశీలిస్తున్నారు. యూనిట్ మంజూరైన తరువాత ఎంతమేరకు ఆదాయం పొందుతున్నారు? పశువులు, ఇతర జీవాల ద్వారా ఆదాయం ఎలా ఉంది? వాహనాలతో రోజుకు ఎంత సంపాదిస్తున్నారు? తదితర వివరాలను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమీకరిస్తున్నారు.