తెలంగాణ

telangana

ETV Bharat / city

మద్యం తాగి వాహన ప్రమాదం చేస్తే కఠిన శిక్ష : సజ్జనార్​

అతిగా మద్యం తాగి, మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు పాల్పడితే.. ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుతో సరిపెట్టబోమని, కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. ఇలాంటి వారిపై ఐపీసీ 304-ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తామని, పదేళ్ల జైలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కోర్టుల్లో సాక్ష్యాధారాలను సమర్పిస్తామని పేర్కొన్నారు. ఇటీవల శంషాబాద్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌ ప్రాంతాలతో పాటు బాహ్యవలయ రహదారులపై మద్యం మత్తులో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.

sajjanar
sajjanar

By

Published : Nov 14, 2020, 10:42 AM IST

మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులవుతున్న వారిపై సైబరాబాద్‌ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. మద్యం సేవించిన వారు రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మృతికి కారకులైతే వారిపై హత్య కేసుతో సమానమైన కేసు నమోదు చేస్తామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఈ కేసు నమోదైన వారికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు.

ప్రత్యేక పర్యవేక్షణ

ప్రతి రోడ్డు ప్రమాదం కేసును... రోడ్డు ట్రాఫిక్‌ ప్రమాదం పర్యవేక్షణ విభాగం పరిశీలిస్తుందని సీపీ తెలిపారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనదారులు చట్టం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. పబ్బుల యాజమాన్యాలు కూడా... పబ్బుల్లో మద్యం సేవించిన వారు వాహనాలు నడపకుండా చూసుకోవాలని లేని పక్షంలో వారిపైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.

ఆధారాలు మాయం చేస్తే...

ప్రమాదం జరిగిన తర్వాత అందుకు బాధ్యులైన వాహనదారులు ఘటనా స్థలం ఆధారాలు మాయం చేసి తప్పించుకోవాలని చూసినా వారిని పట్టుకుంటామని... ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని... ఈ తరహా ప్రమాదాలు పునావృతం కాకుండా చర్యలు చేపట్టినట్టు సజ్జనార్‌ చెప్పారు.

ఇదీ చదవండి :తెలంగాణలో పాఠశాలలకు 120 పనిదినాలు!

ABOUT THE AUTHOR

...view details