తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆశలపై నీళ్లు... కుండపోత వానలతో అన్నదాత ఆగమాగం - crops

రాష్ట్రంలో వర్షాల ప్రభావంతో వ్యవసాయ పంటలు దెబ్బతింటున్నాయి. ఇటీవల కుండపోత వర్షాలు కురుస్తుండటం వల్ల నీటి వనరులు, చెరువులు నిండడంతోపాటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో... వ్యవసాయ పంటలు నీటి మునిగిపోవడం వల్ల రైతులు కలవరపడుతున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ముగియనున్న తరుణంలో పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ తదితర ఉమ్మడి జిల్లాల్లో వరి, పత్తి, కంది, ఇతర పంట క్షేత్రాల్లోకి నీరు రావటంతో దెబ్బతింటుండటం వల్ల దిగుబడులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

crop-loss-due-to-rains-in-telangana
ఆశలపై నీళ్లు... కుండపోత వానలతో అన్నదాత ఆగమాగం

By

Published : Sep 27, 2020, 10:14 AM IST

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు అన్నదాతకు కునుకు లేకుండా చేస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతుండటంతో వ్యవసాయ పంటలు వరద పాలవుతోన్నాయి. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ ఇంటీరియల్ కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల తాజాగా కురుస్తున్న వర్షాలకు దాదాపు 3 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల వరి, పత్తి, ఇతర పంటల క్షేత్రాల్లోకి నీరు చేరింది. మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించడం వల్ల రైతుల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది.

లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

ఇప్పటికే ఆగస్టులో దంచికొట్టిన వర్షాల ప్రభావంతో 3.50 లక్షల ఎకరాలకు పైగా భూముల్లో పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. చేతికందే దశలో పెసర, కందిపై పెద్ద దెబ్బే పడ్డట్లైంది. ఇక మొక్కజొన్న, సోయాబీన్ పంటలపై ఆశలు వదులుకోవాల్సిందే అన్న పరిస్థితి నెలకొంది. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతోపాటు లక్ష ఎకరాల్లో పంట దెబ్బతినడం వల్ల రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. 38 వేల ఎకరాల్లో పత్తి, 30 వేల ఎకరాల్లో వరి, 22 వేల ఎకరాల్లో మిరప పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 4 లక్షల ఎకరాల పైచిలుకు భూముల్లో వివిధ రకాల పంటలు రైతాంగం సాగు చేయగా... 50 వేల ఎకరాల మేర పైర్లు అసలు రాకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 44 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ అదే పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో పలు వాగులు, వంకలు పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల 40 వేల ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది.

గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

ఈ ఏడాది వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం కోటి 3 లక్షల 47 వేల 715 ఎకరాలుగా నిర్ధేశించగా... అనూహ్యంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతోపాటు ప్రధాన జలాశయాలు, నీటి వనరుల అందుబాటులోకి రావడం, విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, రైతుబంధు పథకం కింద ఎకరానికి 5 వేల రూపాయలు పెట్టుబడి సాయం పంపిణీ వెరసి... వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే రికార్డ్ స్థాయికి వెళ్లిపోయింది. మొత్తం కోటి 33 లక్షల 98 వేల 598 ఎకరాల విస్తీర్ణంలో... అంటే 120 శాతం ఆయకట్టు సాగులోకి రావడం విశేషం. ఈ ఖరీఫ్ నుంచి కొత్తగా నియంత్రిత పంట సాగు విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో సూచించిన పంటల సాగుకే రైతులు మొగ్గు చూపడం ఓ ప్రత్యేకత.

ఊహించనిరీతిలో పెరిగిన వరిసాగు..

ప్రధాన ఆహార పంట వరి సాధారణ సాగు విస్తీర్ణం 27.25 లక్షల ఎకరాల విస్తీర్ణం నిర్ధేశించగా... ఊహించనిరీతిలో 52.34 లక్షల ఎకరాల్లో సాగైంది. ఏకంగా 192 శాతం మేర వరి సాగడం అంటే మాటలు కాదు. ప్రధాన వాణిజ్య పంట పత్తి తీసుకుంటే సాధారణ సాగు విస్తీర్ణం 44.50 లక్షల ఎకరాలు నిర్ధేశించగా... ఇది కూడా అమాంతం పెరిగింది. 60 లక్షల 11 వేల 527 ఎకరాల్లో సాగవడం ద్వారా 135 శాతం ఆయకట్టు నమోదు చేసుకుంది. కంది సాధారణ సాగు విస్తీర్ణం 7లక్షల 61వేల 212 ఎకరాలు నిర్ధేశించగా... 10లక్షల 75వేల 293 ఎకరాల్లో... అంటే 141 శాతం మేర సాగైంది. ఈ 3 కీలక పంటలే అత్యధిక విస్తీర్ణం ఆక్రమించుకోగా... సోయాబీన్, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జ, ఇతర చిరుధాన్యాల పంటల్లో ఏ ఒక్కటీ కూడా 89 శాతం మించలేదు. అదీ స్వల్ప విస్తీర్ణమే. ఇంకా వర్షాలు కొనసాగుతున్న దృష్ట్యా... పంటల నష్టం సంబంధించి ఖచ్చితమైన అంచనాలు ఇప్పుడే చెప్పలేమని... గ్రామాల్లో ఏఈవోల ద్వారా గణాంకాలు తెప్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.

అత్యధికంగా ములుగులో.. అత్యల్పంగా నల్గొండలో

జూన్ 1 నుంచి శనివారం వరకు రాష్ట్ర సగటు సాధారణ వర్షపాతం 704.5 మిల్లీమీటర్లు కురవాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా 1061.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఏకంగా 51 శాతం అధికం. అత్యధికంగా ములుగు జిల్లాలో 1913.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా... అత్యల్పంగా నల్గొండ జిల్లాలో 618.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణం, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, జనగాం, వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల 20 శాతానికి పైగా అదనపు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది.

ఇవీ చూడండి: ఔషధం మాటున మాదకద్రవ్యం... మూతపడిన పరిశ్రమలే అడ్డాగా తయారీ

ABOUT THE AUTHOR

...view details