రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని నగరాన్ని నిర్మించేందుకు నాటి ప్రభుత్వం చట్టం చేసింది. భూసమీకరణ విధానాన్ని రూపొందించింది. మీరూ, మేమూ కలసి అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మిద్దామని రైతులకు నచ్చజెప్పి వారిని అందులో భాగస్వాములను చేసింది. ఆంధ్రప్రదేశ్‌కి నివాసయోగ్యమైన, సుస్థిర రాజధాని నిర్మించడం వల్ల ప్రభావితమయ్యే కుటుంబాలకు న్యాయం చేయడమే భూసమీకరణ పథకం ముఖ్యోద్దేశమని పేర్కొంది. రైతులు ఇచ్చే భూముల్లో ‘నవ నగరాల’ కాన్సెప్ట్‌తో అమరావతిని నిర్మిస్తామని వాగ్దానం చేసింది. రైతులు కూడా తమభూముల్లో ఆకాశ హర్మ్యాల్ని, భవిష్యత్ నగరాన్ని ఊహించుకున్నారు. చరిత్రలో తామూ భాగస్వాములవుతామని ఆశించారు. తమ పిల్లలకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని కలలుగన్నారు. నేలతల్లితో తమకున్న బంధాన్ని తెంచుకుని, రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చారు.
ఇప్పుడు ప్రభుత్వం మూడు రాజధానుల్ని తెరపైకి తేవడం.. అమరావతిలో ఒక అసెంబ్లీ భవనాన్ని, వంద మంది ఉద్యోగుల్ని ఉంచి, మిగతావన్నీ తరలిస్తామనడం చట్టప్రకారం చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇది రైతులతో సీఆర్‌డీఏ చేసుకున్న ఒప్పందాన్ని, చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ చర్య రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, రైతుల ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని విశ్లేషిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకునేందుకు వీల్లేదంటున్నారు.
పరిపాలన, న్యాయనగరాలు లేనట్లేగా...
రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ‘నవ నగరాల’ థీమ్‌తో నిర్మిస్తామని చెప్పింది. వాటిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, శాసనసభ, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల నివాస భవనాలు, ఇతర కార్యాలయాలు ఉండే ‘పరిపాలన నగరం’, హైకోర్టు, వివిధ న్యాయ సేవా సంస్థలు, న్యాయమూర్తుల భవనాలు వంటివి కొలువుదీరే న్యాయ నగరంతో పాటు... పర్యాటక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, ఆర్థిక, మీడియా, క్రీడా నగరాలు ఉంటాయని చెప్పింది. భూములిచ్చిన రైతులకు నివాస, వాణిజ్య స్థలాలు నవ నగరాల్లోనే ఇస్తామని చెప్పింది. రాజధాని నిర్మాణానికి సింగపూర్‌కి చెందిన సుర్బానా-జురాంగ్ సంస్థలు రూపొందించిన ప్రణాళికలను మంత్రిమండలి ఆమోదించింది. గ్రామసభల ఆమోదం తర్వాతే రాజధాని బృహత్ ప్రణాళికను ఖరారు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ పేరుతో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు విశాఖ తరలిస్తామని చెబుతోంది. అంటే పరిపాలన నగరం లేనట్టే. హైకోర్టును కర్నూలుకు తరలిస్తామంటే న్యాయ నగరమూ లేనట్టే. అలా చేయడం ముమ్మాటికీ రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని న్యాయనిపుణులు అంటున్నారు.
కొత్త చట్టంలో నవనగరాల ఊసేది..?
సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేసి, ఏఎంఆర్‌డీఏని ఏర్పాటు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెరమీదకి తెచ్చింది. రైతులకు గత చట్టంలో ఇచ్చిన హామీలు కొత్తదానిలోనూ కొనసాగుతాయని తెలిపింది. భూములిచ్చిన రైతులకు స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వడం, వారికి కౌలు చెల్లించడం వంటి అంశాల్నే కొత్త చట్టంలో ప్రస్తావించింది తప్ప.. అంతర్జాతీయ స్థాయి, సుస్థిర, నివాసయోగ్యమైన నగరాన్ని, నవ నగరాల థీమ్‌తో నిర్మించి ఇస్తామన్న హామీని గాలికొదిలేసిందని న్యాయనిపుణులు అంటున్నారు. శాసనసభ అక్కడ ఉంటుందని చెప్పిందే తప్ప, నవ నగరాల ప్రస్తావన కొత్త చట్టంలో ఎక్కడా లేదని గుర్తుచేస్తున్నారు. కేవలం అసెంబ్లీ మాత్రమే అక్కడ ఉంటుందని ప్రభుత్వం ముందే చెబితే రైతులు భూములే ఇచ్చేవారు కాదని, ఇది వారిని ముమ్మాటికీ మోసగించడమేనని అంటున్నారు. మాస్టర్‌ప్లాన్‌ను గ్రామసభలు ఆమోదించిన తర్వాత.. దానిలో ఏ మార్పులు చేయాలన్నా మళ్లీ గ్రామసభల ఆమోదం పొందాల్సిందేనని చెబుతున్నారు.
వెనక్కు వెళ్లేందుకు వీల్లేదు..
రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం 9.14 పేరుతో కీలక ఒప్పందం చేసుకుంది. దానిలో 9.14, 9.14బి అని రెండు భాగాలున్నాయి. 9.14ని ‘అభివృద్ధి ఒప్పందం - మార్పునకు వీలుకాని ప్రాతినిధ్య అధికారం (పవర్ ఆఫ్ అటార్నీ)’గా పేర్కొన్నారు. ‘9.14బి’ని ‘అభివృద్ధి ఒప్పందం 9.14బి - జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడిన అనుబంధ దస్తావేజు’గా పేర్కొన్నారు. అది రూ.100 స్టాంప్ పేపర్‌పై సంబంధిత రైతు, సీఆర్‌డీఏ తరపున సంబంధిత గ్రామానికి భూసమీకరణ అధికారిగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ సంతకాలు చేసి, రిజిస్టర్ చేసుకున్న దస్తావేజు. ఒకసారి ఒప్పందం జరిగాక ఏ ఒక్కరూ వెనక్కు వెళ్లేందుకు వీల్లేదని దానిలో స్పష్టంగా పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడం ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే.
- రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. దానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన డబ్బు ఉంది. అంత ప్రజాధనం ఖర్చు పెట్టి, రాజధాని నిర్మాణం కీలకదశకు చేరుకున్నాక... పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తరలిస్తామనడం కుదరదు.