ప్రభుత్వ భూముల వేలం దుర్మార్గామైందని.. భవిష్యత్తు తరాలకు ఏం సమాధానం చెబుతారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. తక్షణమే భూముల వేలం ప్రక్రియకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వ కార్యాలయాలు... ప్రైవేట్ భవనాల్లో నడుపుతున్నారని ఆ స్థానంలో సర్కార్ ఆఫీసులు నిర్మిస్తే ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని హితవు పలికారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేస్తే అవి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక వేత్తల వశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిటీష్ వాళ్లు పెట్టిన దేశద్రోహం చట్టాన్ని ఇప్పటి వరకు కొనసాగడం సిగ్గు చేటని నారాయణ అన్నారు. రాజకీయ కక్షలతో ప్రత్యర్థులపైన దేశ ద్రోహం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.