కరోనా బారిన పడిన వ్యక్తికి ఇంట్లో చికిత్స పొందేందుకు వీల్లేకపోతే.. అద్దె భవనాల్లో ఉంచి చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. జోన్ స్థాయిలో అద్దె భవనాలు గుర్తించి ఏర్పాట్లు చేయాలని సూచించింది. నగరంలో ఆరు జోన్లుండగా ఒక్క ఖైరతాబాద్ జోన్ అధికారులు మాత్రమే కొన్ని భవనాలను ఐసోలేషన్ కేంద్రాలకు సిద్ధం చేస్తుండటం గమనార్హం. బస్తీ వాసులు చాలామంది ఇరుకు ఇళ్లలో ఉంటారు. ఇలాంటి వారు కరోనా బారినపడి లక్షణాలు తక్కువగా ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అద్దె భవనాల్లో ప్రత్యేక పడకలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోందని నిపుణులు సూచిస్తున్నారు.
- బహదూర్‌పురా నియోజకవర్గంలోని అలియాబాద్‌లో ‘యు’ ఆకారంలో 8 రేకుల షెడ్లుంటాయి. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంది. ఇటీవల ఇక్కడి ఓ ఇంట్లోని తల్లి, కుమారుడికి వైరస్ సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. వీరితో మరుగుదొడ్డిని పంచుకొనేందుకు భయపడి కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
- మేకలబండలో వ్యాధి లక్షణాల్లేని పలువురు ఇరుగుపొరుగు వారితో మాటామంతీ కలపడం వల్ల అనేకమంది మహమ్మారి బారిన పడ్డారు. ఇలా అలియాబాద్ చుట్టుపక్కల ఇప్పటివరకు 106 మంది వైరస్ బారినపడ్డారు.