తెలంగాణ

telangana

ETV Bharat / city

Death Rate: 'సగటు'ను మించిన మరణాలు.. గత నెలలో ఏకంగా రెండు రెట్లు! - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

ఏపీలో ఈ ఏడాది మే నెలలో 86 వేలకుపైగా మరణాలు సంభవించినట్లు అధికారికంగా నమోదైంది. సాధారణ పరిసితుల్లో ప్రమాదాలు, వ్యాధులు, వృద్ధాప్య కారణాలు వంటివన్నీ కలిపి.. నెలకు సగటున అధికారికంగా నమోదయ్యే మరణాలు సుమారు 30-35 వేల మధ్య ఉంటున్నాయని గత రికార్డులు చెబుతున్నాయి. 2019లో సగటున నెలకు 31,597 చనిపోగా.. 2020లో ఈ సంఖ్య 36 వేలకుపైగా ఉంది. అయితే ఈ ఏడాది మేలో వాటికన్నా సుమారు రెండు రెట్లకుపైగా మరణాలు నమోదవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

Death Rate
'సగటు'ను మించిన మరణాలు.. గత నెలలో ఏకంగా రెండు రెట్లు!

By

Published : Jun 15, 2021, 8:48 AM IST

ఆంధ్రప్రదేశ్​లో మరణాల సంఖ్య సగటు కన్నా రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మరణాల సంఖ్య ఇంత ఎక్కువగా నమోదవడానికి కొవిడ్‌ కారణమా? అంటే.. ప్రభుత్వం మే నెలలో అధికారికంగా ప్రకటించిన కరోనా మరణాల సంఖ్య కేవలం 2,938 మాత్రమే. అవి కలిపినా.. 35 వేలు లేదా 40వేల మరణాలు నమోదవ్వాలి. ఏకంగా 86 వేలకుపైగా రిజిస్టరవడానికి కారణాలేంటి? మే నెలలో కరోనా తప్ప.. ఆరోగ్యపరంగా ఇతర అసాధారణ పరిస్థితులేమీ లేవు. విష జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి వ్యాధులూ ప్రబలలేదు.

కర్ఫ్యూ నిబంధనలు, ఆంక్షలు అమల్లో ఉండటం, ప్రజా రవాణా వాహనాల సంఖ్య తగ్గడంతో.. రోడ్డు ప్రమాదాల మరణాలూ తక్కువగానే ఉన్నాయి. అటు కరోనా కాక, ఇతర ప్రాణాంతక వ్యాధులూ లేనప్పుడు, రాష్ట్రంలో ఒకే నెలలో ఇంత ఎక్కువ సంఖ్యలో ఎలా మరణాలు నమోదయ్యాయి? అన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొన్ని సార్లు నమోదు ఆలస్యంగా జరుగుతోంది. గత నెలల్లో జరిగిన వాటిని కూడా ప్రస్తుత నెలలో నమోదు చేస్తున్నారు. ఇలా జరిగేవి కొన్నిసార్లు వందలు, వేలల్లోనూ ఉండే అవకాశం ఉంది.

ఇది వరకు సంభవించిన కొన్ని మరణాలు ఆ తర్వాత నెలల్లోనూ నమోదవుతుంటాయి. ఆర్డీవో స్థాయిలో విచారణ, నిర్ధారణ చేసుకుని వాటిని రిజిస్టర్‌ చేస్తారు. అలాగే సాంకేతిక కారణాల వల్ల కొందరి పేర్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదయ్యే అవకాశం ఉంది. వాటిని తొలగించి తుది జాబితా సిద్ధం చేస్తుంటారు. అలా ఒకటి కంటే ఎక్కువ నమోదయ్యే పేర్లు సాధారణంగా 500 నుంచి వెయ్యి వరకు మాత్రమే ఉంటుంటాయి. ఆ విధంగా చూసినా కూడా కేవలం ఒక్క నెలలో అన్ని ఎక్కువ నమోదవడం అసాధారణమే.

మరణాల సంఖ్య ఇలా..

ఆ నెలల్లో మరణాలు ఎక్కువ..!

* రాష్ట్రంలో 2019, 2020 సంవత్సరాల్లోను, 2021లో మే వరకు నెలవారీగా రిజిస్టరైన లెక్కలు పరిశీలిస్తే.. 2019లో ఏప్రిల్‌ నెలలో కనిష్ఠంగా 26,124.. గరిష్ఠంగా అక్టోబరులో 35,273 మరణాలు సంభవించాయి. ఆ ఏడాది సగటున నెలవారీ నమోదైన సంఖ్య 31,597.

* 2020 ఏప్రిల్‌లో కనిష్ఠంగా 21,711 ఉండగా.. సెప్టెంబరులో గరిష్ఠంగా 59,842 మరణాలు నమోదయ్యాయి. 2020లో నెలవారీ సగటు 36,976 కాగా.. కరోనా ఉద్ధృతంగా ఉన్న ఆగస్టులో 52,447, సెప్టెంబరులో 59,842, అక్టోబరులో 45,952 మరణాలు నమోదవడం గమనార్హం.

* 2021లో జనవరి నుంచి మే వరకు నెలవారీ నమోదైన సగటు మరణాలు 45 వేలకుపైగా ఉన్నాయి. కరోనా ఉద్ధృతి తక్కువగా ఉన్న ఫిబ్రవరిలో 31 వేలకుపైగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 38 వేలు దాటింది. మే నెలలో ఏకంగా 86 వేలకుపైగా నమోదయ్యాయి.

ఆ రెండు జిల్లాల్లో ఎక్కువ..!

* 2021 మే నెలలో అత్యధికంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 10 వేలకుపైగా మరణాలు ఉన్నాయి.

* విశాఖ జిల్లాలో సుమారు 9 వేలు, తూర్పుగోదావరి జిల్లాలో 8 వేలకుపైగా రిజిస్టరయ్యాయి.

* జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో కనిష్ఠంగా.. గుంటూరు జిల్లాలో గరిష్ఠంగా ఉన్నాయి.

ప్రత్యేక పోర్టల్‌ ద్వారా నమోదు..

వ్యాధులు, రోడ్డుప్రమాదాలతో పాటు ఏ ఇతర కారణాలతో చనిపోయినా.. వారి వివరాల్ని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేస్తారు. వాటిని ప్రభుత్వ జనన, మరణాల పోర్టల్‌లో అప్‌డేట్‌ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వీటి రిజిస్ట్రేషన్‌ కోసం సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) పేరుతో ప్రత్యేక పోర్టల్‌ నిర్వహిస్తోంది. ఎవరైనా చనిపోయిన 21 రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌ జరగాలని నిబంధన ఉంది. దీని వల్ల ఒక్కోసారి ఒక నెలలో సంభవించిన మరణాల వివరాల్లో కొన్ని, మరుసటి నెలలో నమోదవుతున్నాయి.

ఒకరి పేరే రెండుసార్లు: భాస్కర్‌

మే నెలలో ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదవడానికి సాఫ్ట్‌వేర్‌ సమస్య కారణమని కుటుంబ సంక్షేమం, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పేర్కొన్నారు. ‘మరణాల రిజిస్ట్రేషన్‌లో... సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్ల చాలా మంది పేర్లు రెండుసార్లు నమోదవుతున్నాయి. మా సాంకేతిక బృందం ఆ జాబితాలను సరిచేసే పనిలో ఉంది. ఇలా ప్రతి నెలలోను జరుగుతుంది. ఎక్కువసార్లు నమోదైన పేర్లు తొలగించి నెలాఖరుకి తుది జాబితా సిద్ధం చేస్తున్నాం..’’ అని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:Tragedy: రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. కుటుంబంలో ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details