హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన వారంతా గాంధీలో చికిత్స పొందుతున్నారు. వీరితో సన్నిహితంగా ఉన్నవారిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కేసులు నమోదైన ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా గుర్తించి చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య, పోలీసు, ఎంటమాలజీ విభాగాల నుంచి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.
కంట్రోల్ రూమ్ సేవలు..
లాక్‌డౌన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బల్దియా కాల్‌సెంటర్‌కు గురువారం 374 కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెండు కరోనా అనుమానిత కాల్స్ కాగా... 357 మంది ఆహారం సరఫరా చేయాలని కోరారు. గ్రేటర్ వ్యాప్తంగా 193 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 71,680 మందికి మధ్యాహ్న భోజనం, 94 కేంద్రాలతో 40,940 మందికి రాత్రి భోజనం అందించారు.