KTR Vs Bandi Sanjay: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌పై పరువునష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయవద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్ఠకు భంగం కలిగించారని కేటీఆర్ పిటిషన్ వేశారు.
కేటీఆర్‌పై పరువునష్టం వ్యాఖ్యలు చేయొద్దని బండి సంజయ్‌కు కోర్టు ఆదేశం - Band Sanjay Latest Updates
21:39 June 10
కేటీఆర్‌పై పరువునష్టం వ్యాఖ్యలు చేయొద్దని బండి సంజయ్‌కు కోర్టు ఆదేశం
బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంపై తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని పిటిషన్ వేశారు. మే 11న బండి సంజయ్ "భాజపా 4 తెలంగాణ" ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారని.. కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రి నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు మరణిస్తే సీఎం స్పందించలేదని నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. ఆ ట్వీట్‌ను ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ ట్విటర్‌కు కూడా ట్యాగ్ చేశారన్నారు. బండి సంజయ్ ట్వీట్ విస్తృతంగా ప్రచారం జరగడం వల్ల కేటీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగిందని పిటిషన్లో న్యాయవాది తెలిపారు. అబద్ధమని తెలిసి కూడా సంచనలం కోసం కేటీఆర్, సీఎంపై సంజయ్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.
ఎంపీగా హుందాగా, పారదర్శకంగా ఉండి... వాస్తవాలను తెలుసుకొని ప్రకటనలు చేయాలన్న బాధ్యతలను విస్మరించారన్నారు. ఇంటర్ పరీక్షలు, మూల్యాంకనం ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం చేపడతుందని.. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతేడాది డిసెంబరులో ఆత్మహత్యలు జరిగాయని.. అప్పటి నుంచి కనీసం సంతాపం కూడా తెలపని బండి సంజయ్... ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పి... ట్విట్టర్ నుంచి వీడియో తొలగించాలని గత నెల 13న లీగల్ నోటీసు ఇచ్చినప్పటికీ... బండి సంజయ్ స్పందిచలేదని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జాతీయ పార్టీ ప్రతినిధిగా, ఎంపీగా హుందాగా ఉండాల్సిన బండి సంజయ్... రాజకీయ స్పర్థతో, వ్యక్తిగత కక్షతో తప్పుడు విమర్శలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
కేటీఆర్ ప్రతిష్ఠకు జరిగిన నష్టం డబ్బుతో పూడ్చలేరని... ఇలాగే కొనసాగితే తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలు సేకరించిన తర్వాత పరిహారం కోరతానన్నారు. మీడియా ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పేలా బండి సంజయ్‌ని ఆదేశించాలని కోర్టును కేటీఆర్ కోరారు. ట్విట్టర్లో ఉన్న వీడియోలు, వ్యాఖ్యలు తొలగించాలని.. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశించాలన్నారు. కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా, సామాజిక మాధ్యమాలు, సమావేశాలు, ఇంటర్వ్యూల ద్వారా కేటీఆర్‌పై పరువునష్టం కలిగే వ్యాఖ్యలు చేయవద్దని బండి సంజయ్ ని కోర్టు ఆదేశించింది. పిటిషన్ లో కేటీఆర్ ఆరోపణలపై కౌంటరు దాఖలు చేయాలని బండి సంజయ్‌కి నోటీసు జారీ చేసి విచారణ వాయిదా వేసింది.
ఇదీ చూడండి: