ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో ఎంపీ కేశినేనినాని, గద్దె రామ్మోహన్.. పశ్చిమలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా విస్తృత ప్రచారం నిర్వహించారు. 49వ డివిజన్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి.. ఎమ్మెల్సీ బుద్దా ప్రచారంలో పాల్గొన్నారు. 19వ డివిజన్ అభ్యర్థి తరఫున కేశినేని నాని, గద్దె రామ్మోహన్ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
నగరంలోని 36వ డివిజన్‌లో సీపీఐ కార్యాలయాన్ని తెలుగుదేశం నేత బొండా ఉమ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. విజయవాడ అభివృద్ధిపై సీఎం జగన్ కనీస దృష్టి పెట్టలేదని బొండా ఉమ విమర్శించారు. ప్రశాంత విజయవాడ కావాలంటే.. తెలుగుదేశానికి మరోసారి మేయర్ పీఠం కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ 40వ డివిజన్‌లో జనసేన అభ్యర్థిని గెలిపించాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రచారంలో పాల్గొనగా.. 36వ డివిజన్‌లో భాజపా అభ్యర్థి ఆర్ముగం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 49 వ డివిజన్‌లో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి బొల్లా విజయ్‌కుమార్ తరఫున గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రచారం చేశారు. 1వ డివిజన్‌లో ఉద్దంటి సునీత సురేష్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రచారాన్ని నిర్వహించారు. రెండేళ్ల కాలంలో వైకాపా అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలందరూ తమవైపే ఉన్నారన్న నేతలు.. బెజవాడ మేయర్ పీఠాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.