- కరీంనగర్‌లోని ఒక వృద్ధాశ్రమంలో కరోనా కేసు బయటపడింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. కొవిడ్ బారినపడిన వ్యక్తికి చికిత్స చేయించేందుకూ సంసిద్ధత వ్యక్తంచేయలేదు. దీంతో ఆశ్రమ నిర్వాహకులే వైద్యం అందించారు.
- హైదరాబాద్‌లోని మరో ఆశ్రమంలో కరోనా కేసులు బయటపడ్డాయి. అక్కడ ఆశ్రయం పొందుతున్న కొందరు వృద్ధులను పిల్లలు తమ ఇంటికి, శుభకార్యాలకు తీసుకెళ్లిన నేపథ్యంలో వైరస్ సోకినట్టు నిర్వాహకులు గుర్తించారు. వైద్యం చేయిస్తున్న సమయంలో ఒకరు మరణించడంతో అందరికీ పరీక్షలు చేయించారు. దాదాపు 22 మందిలో పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో వివిధ ఆస్పత్రుల్లో వైద్య సహాయం అందిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 180కిపైగా వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. వీటిలో 100 వరకు వృద్ధాశ్రమాలు ప్రభుత్వం వద్ద నమోదయ్యాయి. ఒక్కో దానిలో 30 నుంచి 60 మంది వరకు ఉంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో నిర్వాహకులు వృద్ధులను వారి బంధువులు, పిల్లల వద్దకు పంపించారు. 50 శాతం మంది వెళ్లిపోగా, కుటుంబ సమస్యలు, పిల్లలు ముందుకు రాకపోవడం, విదేశాల్లో ఉండిపోవడం వంటి కారణాలతో మిగతా 50 శాతం మంది ఆశ్రమాలకే పరిమితమయ్యారు.
కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటీవల ఆశ్రమాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ‘వారిని చూసేందుకు మనవళ్లు, మనవరాళ్లు వచ్చి వెళ్తున్న నేపథ్యంలో వారి ద్వారా కొందరు, శుభకార్యాలకు వెళ్లివచ్చిన సందర్భాల్లో కొంతమంది, ఉదయం నడకకు వెళ్లిన సమయంలో మరికొందరు కరోనా బారిన పడ్డారు. ఆశ్రమాలకు కూరగాయలు తెచ్చేవారు, బయట నుంచి వచ్చి పనులు చేసే వారితోనూ వైరస్ వ్యాప్తిస్తోంది’ అని నగరంలోని ఓ ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ‘‘మా ఆశ్రమంలో వైద్యుడు వైరస్ బారినపడ్డారు. తెలిసిన వెంటనే ఆశ్రమంలోని అందరికీ పరీక్షలు నిర్వహించి కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్నాం. కొవిడ్ కన్నా కుటుంబ సభ్యులు తమ కోసం రావడం లేదనే బాధే వారిని ఎక్కువగా కుంగదీస్తున్నట్టు గుర్తించాం’ అని సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు కె.నారాయణ తెలిపారు.