తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2021, 8:13 AM IST

Updated : Jun 10, 2021, 8:33 AM IST

ETV Bharat / city

'ఏపీలో 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు'

కొవిడ్‌ తొలి దశ నుంచి ఇప్పటివరకు ఏపీలో 2,00,39,764 మంది నమూనాలు పరీక్షించామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్​లోనే అత్యధిక పరీక్షలు జరిగాయని చెప్పారు.

corona tests in ap
ఏపీలో కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్​లో బుధవారం 12వ ఫీవర్‌ సర్వే ప్రారంభమైందని, ఇది శుక్రవారంతో ముగుస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మలిదశలో ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల ద్వారా 2,72,240 మందిలో అనుమానిత లక్షణాలు గుర్తించామన్నారు. వీరిలో అవసరమైన వారికి పరీక్షలు జరపగా 33,262 మందికి వైరస్‌ సోకినట్లు తేలిందన్నారు. ‘రాష్ట్రంలో ఇప్పటివరకు 1,955 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 114 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,301 క్రియాశీలక కేసులున్నాయి. కేంద్రం ప్రభుత్వం మంగళవారం మరో 7 వేల యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లను రాష్ట్రానికి పంపింది’ అని వివరించారు. ఇంకా ఏమన్నారంటే..

9.37%కి తగ్గిన కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా పదివేలలోపే వస్తున్నాయి. 104 కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫోన్ల సంఖ్య కూడా తగ్గుతోంది. మే 3న 19,175 ఫోన్‌కాల్స్‌ రాగా గత 24 గంటల్లో ఈ సంఖ్య 2,482 మాత్రమే. మే 16న కరోనా పాజిటివిటీ రేటు 25.56%గా ఉంది. ప్రస్తుతం 9.37%కి పరిమితమైంది.

రాష్ట్రానికి చేరిన 4.20 లక్షల టీకాలు

రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసిన 4.20 లక్షల కొవిషీల్డ్‌ డోసులు మంగళవారం రాష్ట్రానికి చేరాయి. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 1,09,69,000 డోసుల పంపిణీ జరిగింది. వీటిలో 58 లక్షల మంది మొదటి డోసును, 25 లక్షల మందికి పైగా రెండు డోసులూ పొందారు. ఉత్పత్తి సంస్థల నుంచి ప్రభుత్వం సొంతంగా కొన్న వ్యాక్సిన్లలో రాష్ట్రానికి 16.54 లక్షల డోసులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ కోటా కింద 51.40 లక్షల డోసులు రావాల్సి ఉంది.

5 లక్షల మందికి టెలి వైద్య సేవలు

మే 1 నుంచి బుధవారం వరకు 104 కాల్‌ సెంటర్‌ ద్వారా టెలీ కన్సల్టేషన్‌ విధానంలో 5 లక్షల మంది బాధితులు వైద్యసేవలు పొందారు. 5,102 మంది వైద్యులు సలహాలు, సూచనలు ఇచ్చారని వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

400 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల రాక

భారత్‌- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి 400 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందినట్లు కొవిడ్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ నోడల్‌ అధికారి అర్జా శ్రీకాంత్‌ తెలిపారు. వీటిలో తూర్పుగోదావరి జిల్లాకు 200, పశ్చిమగోదావరికి 100, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు 50 చొప్పున పంపిస్తున్నామని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇదీ చదవండి:HIGH COURT: జొన్నల సేకరణకు 2 రోజుల్లో జీవో జారీ చేస్తాం: ప్రభుత్వం

Last Updated : Jun 10, 2021, 8:33 AM IST

ABOUT THE AUTHOR

...view details