హైదరాబాద్లో ప్రాంతీయ రింగురోడ్డును రెండు దశల్లో నిర్మించాలనేది నిర్ణయం. మొత్తంగా 344 కిలోమీటర్ల మార్గానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఉత్తర మార్గాన్ని సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని నిర్ణయించింది. జాతీయ రహదారిగా గుర్తిస్తూ సంఖ్యనూ కేటాయించింది. ఉత్తర భాగం నిర్మాణానికి 4,750 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఏయే ప్రాంతాల మీదుగా రహదారి నిర్మాణాన్ని చేపట్టాలన్న అంశంపై సవివర నివేదికను రూపొందించే కన్సల్టెంట్ సంస్థను ఎంపిక చేసేందుకు గత నెలలో కేంద్రం టెండర్లు ఆహ్వానించింది.
ప్రాంతీయ రింగురోడ్డుకు కరోనా టెండర్.. మరో వారం పొడిగింపు - హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు అవతల నిర్మించబోయే ప్రాంతీయ రింగు రోడ్డు పనులు ఒకడుగు ముందుకు, రెండడుగుల వెనక్కు అన్నట్లుగా తయారయ్యాయి. గుత్తేదారులెవరూ ముందుకురాకపోవడంతో క్షేత్ర స్థాయిలో సవివర నివేదిక రూపొందించే కన్సల్టెంట్ సంస్థను నియమించే టెండర్ల గడువు మరో వారం పొడిగించాల్సి వచ్చింది.
టెండర్లలో పాల్గొనే ఆసక్తి ఉన్న సంస్థల అనుమానాలను నివృత్తి చేసేందుకు వీలుగా ఈ నెల 7వతేదీన కేంద్ర మంత్రిత్వ శాఖ దిల్లీలో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. దానికి ఒక్కరంటే ఒక్కరూ హాజరు కాలేదు. దిల్లీలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టెండరుదారులు భయపడి ఉంటారని భావించిన మంత్రిత్వశాఖ ఆన్‌లైన్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. అదీ కార్యరూపం దాల్చలేదు. మొత్తంగా టెండర్ల దాఖలుకు చివరిరోజైన సోమవారం నాటికి ఒక్కటీ దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎంతకాలం పొడిగించాలనే అంశంపై వివిధ వర్గాల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న అనంతరం వారం రోజుల పొడిగిస్తూ సోమవారం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.