రాష్ట్రంలో మహమ్మారి భారీగా విస్తరిస్తోంది. నిత్యం వందల కేసులు నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా 352మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఒక్కరోజులో ఇంత భారీ ఎత్తున కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. రికార్డు స్థాయిలో వెలుగు చూసిన కరోనా కేసులు రాష్ట్ర ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు భారీగా నమోదవుతున్నందున... మహానగరం పరిసర ప్రాంతాల్లో 50వేల టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించి మూడు రోజులుగా ఆ మేరకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో కేసుల సంఖ్య రెండు రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం 1,096 మందికి కరోనా పరక్షలు చేయగా... 269మందికి, గురువారం 352 మందికి కరోనా నిర్ధారణ అయింది.
రాజదానిలోనే ఎక్కువ
గురువారం నమోదైన కేసుల్లో 302 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావటం గమనార్హం. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌లో 10 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాలలో 4, జనగామ, వరంగల్ అర్బన్‌లో 3, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్‌లో 2 కేసులు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. ఇక తాజాగా నమోదైన కేసులతో కలిసి ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,027మంది కోరనా బారిన పడ్డారు. ఇక తాజాగా 230 మంది డిశ్చార్జ్ కాగా... ఇప్పటి వరకు 3,301మంది కోలుకుని ఇంటికెళ్లారు. ప్రస్తతం 2,531మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం మరో ముగ్గురు మహమ్మారితో మృతి చెందగా... ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 195కి చేరింది.