Corona Medicine Sales in Telangana : ఒమిక్రాన్ దెబ్బకు ఔషధ విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. రాష్ట్రంలో మూడో దశకు ముందు రూ.70 కోట్ల మేరకు కొవిడ్ మందు అమ్మకాలు కాగా ఈ మూడువారాల్లో ఏకంగా 8-15 రెట్లు పెరిగాయి. సుమారు రూ.600 కోట్ల కొవిడ్ మందులను ప్రజలు వినియోగించారు. కరోనా బాధితుల్లో అత్యధికులు ఇంటి వద్దనే చికిత్స పొందుతుండటంతో.. బహిరంగ విపణిలో ఔషధ విక్రయాలు బాగా పెరిగినట్లుగా వైద్యవర్గాలు విశ్లేషించాయి. మందులు లభ్యం కావనే భావనతో ఎక్కువగా కొనుగోలు చేసి భద్రపర్చుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు.
95 శాతం ఇంటి వద్దనే..
Covid Medicine Sales in Telangana: వైద్యఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. ఈ నెల 25 నాటికి రాష్ట్రంలో 34 వేల మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. వారిలో 95 శాతం ఒమిక్రాన్ బాధితులే. వారిలో దాదాపు 95 శాతం మంది ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నారు. కుటుంబంలో ఒకరిలో లక్షణాలు కనిపించగానే.. ఒకట్రెండు రోజుల్లోనే మిగిలిన సభ్యుల్లోనూ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో అందరూ కొవిడ్ ఔషధాలను వాడుతున్నారు. దీంతో ఔషధ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. చాలాచోట్ల పేరున్న ఔషధ ఉత్పత్తి సంస్థల దగ్గు మందు అందుబాటులో ఉండడంలేదు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావ తీవ్రత అధిక సందర్భాల్లో గొంతు వరకే పరిమితమవుతుండటం.. ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగా ఉండటం.. తదితర కారణాలతో వైద్యులు కూడా పరిమిత సంఖ్యలోనే ఔషధాలను సూచిస్తున్నారు. యాంటీబయాటిక్స్ ఔషధాల వాడకం ఈ దశలో అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నా.. ఐసీఎంఆర్ సూచిస్తున్నా.. వీటిని మాత్రం ఎక్కువమంది వాడుతూనే ఉన్నారు. అందువల్ల వాటి విక్రయాలు పెరిగాయి.
స్వీయ పరీక్షలకు డిమాండ్
Telangana Corona Cases Today : ఇంటి వద్దనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించడంతో.. విపణిలో దాదాపు అన్ని ఔషధ దుకాణాల్లోనూ స్వీయ నిర్ధారణ కొవిడ్ కిట్లు లభిస్తున్నాయి. ఎక్కువమంది వీటిని కొని సొంతంగా పరీక్షించుకుంటున్నారు. ఒక్కో కిట్ ఖరీదు సుమారు రూ.250. ఈ కిట్లను ఒక పెద్దషాపులో రోజుకు 500 వరకూ విక్రయిస్తున్నారు. అదే చిన్న షాపులో సుమారు 100 వరకూ విక్రయిస్తున్నారు. ఈ నెలలోనే సుమారు రూ.150 కోట్ల స్వీయ నిర్ధారణ కిట్లు అమ్మినట్లు ఔషధ వ్యాపార వర్గాలు తెలిపాయి.
Corona Cases in Telangana Today : హైదరాబాద్ నిమ్స్ సమీపంలో ఉన్న రెండు పెద్ద ఔషధ దుకాణాల్లో సాధారణ రోజుల్లో రోజుకు రూ.50-60 వేల వరకూ విక్రయాలు జరుగుతుంటాయి. అయితే గత 3 వారాలుగా కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరగడంతో.. వీటిలో రోజుకు ప్రస్తుతం రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకూ అమ్మకాలు సాగుతున్నాయి.
Telangana Covid Cases Today : వరంగల్‌లోని ఒక కాలనీలో ఉన్న మందుల దుకాణంలో సాధారణ రోజుల్లో రోజుకు సుమారు రూ.40 వేల వరకూ అమ్మకాలుంటాయి. అయితే ఇప్పుడు రోజుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో మందుల వినియోగం ఎలా ఉందో చెప్పడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.