సురభి.. అసాధారణ చరిత్ర ఉన్న నాటక సమాజం.. కరోనా విజృంభణతో కకావికలమైపోతోంది. 136 ఏళ్ల తమ ప్రస్థానంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదంటూ సమాజంలో ఎవరిని కదిపినా కంటతడి పెడుతున్నారు. సురభి ఆధ్వర్యంలో తెలుగునేలపై ఒకప్పుడు యాభైకి పైగా విస్తరించిన నాటక సమూహాలు గత కొన్నేళ్లలో ఒకదాని తర్వాత ఒకటి మూతపడ్డాయి. మిగిలిన నాలుగైదూ కరోనా విజృంభణతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కళారాధనలోనే ఉన్న వేంకటేశ్వర నాట్యమండలి గతేడాది కొవిడ్ దెబ్బకు నిలిచిపోయింది. మిగిలి ఉన్న వినాయక, భానూదయ, విజయభారతి, శారదావిజయ సమాజాలు కూడా ఇటు ప్రదర్శనలు లేక, అటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఇచ్చే గౌరవ వేతనాలు మూడేళ్లుగా అందక చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇదే సమయంలో కరోనా బారినపడ్డ నటులు ఒకరి తర్వాత ఒకరు రాలిపోతున్నారు.
Corona : కరోనాతో ముగిసిపోయిన పాత్రలు - corona effect on surabhi drama company activists
ఇచ్చోటనే.. ఒకనాడు తెలుగు కళామతల్లి నొసటన కుంకుమ అరుణవర్ణంతో శోభించింది.. వందల మంది కళాకారుల అద్భుత అభినయానికి జేజేలు పలికింది.. ఇప్పుడిది.. నిటలాక్షుడు గజ్జెకట్టి కదం తొక్కిన రంగస్థలం.. మృత్యువు కరాళ నృత్యం చేస్తూ పదుల సంఖ్యలో ప్రాణాలు హరించిన మరుభూమి.
తెలుగువారికే సొంతమైన పద్యనాటకాన్ని నలుదిశలా చాటిన సురభి జమునారాయులు, అనేక పాత్రలకు జీవం పోసిన ఝాన్సీలక్ష్మి గతేడాది మహమ్మారికి బలైపోయారు. కరోనా రెండు విడతల్లో మొత్తం 23 మంది కళాకారులు కన్నుమూసినట్లు సురభి వర్గాలు తెలిపాయి. సంగీతం, సాంకేతిక రంగం, మేకప్, లైటింగ్, సెట్టింగ్.. ఇలా వివిధ విభాగాలకు చెందిన మరో 55 మంది కూడా మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇప్పుడు లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న సురభి కాలనీతోపాటు, నాటక సమాజాల్లో ఎక్కడ చూసినా విషాద ఛాయలు కనిపిస్తాయి. మరోవైపు కరోనా వస్తే వైద్యం చేయించుకోలేక అల్లాడుతున్న కళాకారులూ తమ ఆవేదన వినిపిస్తారు. దాదాపు రూ.9.50 లక్షలు వైద్య ఖర్చుల కోసం వెచ్చించి.. ప్రాణాలతో బయటపడ్డ శ్రీ వినాయక నాట్యమండలి నిర్వాహకులు సురభి వేణుగోపాల్‌రావు ఇప్పుడు ఆ అప్పును ఎలా తీర్చాలని తలకిందులవుతున్నారు.
ఎంత కష్టం..
రేకందర్ నాగేశ్వరరావు. సురభి బాబ్జీగా సుపరిచితులు. నాటక రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం.. 2013లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2011లో సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు ఆదిత్య బిర్లా అవార్డు అందుకున్నారు. నాలుగో తరం వారసుడిగా, శ్రీవేంకటేశ్వర నాట్యమండలి బాధ్యతలు చేపట్టిన బాబ్జీ ఆధ్వర్యంలో దాదాపు 30 కుటుంబాలు చల్లగా బతికేవి. పిల్లలు లేని బాబ్జీ అందరినీ సొంతవారిలాగే చూసుకునేవారు. దాదాపు 55 మందికి పైగా నటవర్గం ఉండేవారు. సాంకేతిక రంగానికి చెందిన మరో 20 మంది ఆయన్ను నమ్ముకొని జీవనం సాగించేవారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో అత్యధిక ప్రదర్శనలు ఇచ్చిన ఈ సమాజాన్ని కరోనా’ రక్కసి కాటేసింది. మొదటి విడత లాక్‌డౌన్‌తో ప్రదర్శనలు నిలిచిపోయాయి. నటవర్గం అంతా చెల్లాచెదురవడంతో 83 ఏళ్ల చరిత్ర ఉన్న నాట్యమండలి మూతపడింది. కరోనా వ్యాధితో బాబ్జీ కుటుంబసభ్యులైన ఝాన్సీ, నాగేంద్రప్రసాద్ చనిపోయారు. మహమ్మారి రెండో విడత విజృంభణ అతనికి తీరని విషాదమే మిగిల్చింది. గత ఏప్రిల్‌లో ఆయన సతీమణి మృతి చెందారు. నటి సింధూరి బేబి, చెల్లెలు రాజేశ్వరి రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు లేని బాబ్జీ.. ప్రస్తుతం సురభి కాలనీలోని తన నివాసంలో ఒంటరిగా మిగిలారు.