ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ 192 మంది కొవిడ్-19 బారిన పడ్డారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. మరో 71 కేసులకు సంబంధించి రక్తనమూనాల నివేదికలు రావాల్సి ఉంది. నెల్లూరుకు సంబంధించి శనివారం వచ్చిన 41 నివేదికలు నెగిటివ్ రావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక గుంటూరు జిల్లాలో ఇప్పటివరకూ 30మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కృష్ణా జిల్లాలో 28 మందికి కొవిడ్-19 సోకినట్లు అధికారులు వెల్లడించారు. జగ్గయ్యపేటలో మరో పాజిటివ్ కేసు నమోదుతో... ఆ ప్రాంతంలో వ్యాధిబారిన పడిన వారి సంఖ్య మూడుకి చేరింది. దిల్లీ నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారిలో తొలి విడత పరీక్షలకు పంపిన ఆరుగురిలో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తహసీల్దార్ వెల్లడించారు.
కడపలో కలవరం
కడప జిల్లాల్లో ఇప్పటివరకూ 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడ్రోజుల వ్యవధిలోనే.. ఈ సంఖ్య 23కి చేరటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంకా 185 మంది నమూనాల నివేదికలు రావాల్సి ఉంది. ప్రొద్దుటూరులో 10 కేసులు నమోదు కాగా... మిగిలినవి కడప, అలంఖాన్‌పల్లె, వేంపల్లె, పులివెందుల, బద్వేలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. అలంఖాన్‌పల్లెలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. ఇతను మరో 70 మందిని కలిశారని అధికారులు గుర్తించి... వారందరినీ జిల్లా కొవిడ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా అనుమానిత వ్యక్తుల నుంచి 380 నమూనాలు సేకరించారు.
అంతటా అప్రమత్తం
ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకూ 21 కేసులు నమోదయ్యాయి. కేసులు సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇంతవరకూ లండన్, దిల్లి నుంచి వచ్చిన కేసులు మాత్రమే బయటపడగా... ప్రస్తుతం వారిని కలిసిన వారికీ పాజిటివ్ వచ్చినట్లు తెలుసుకున్నారు. బాధితులు కొవిడ్-19 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని... ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. దిల్లీ వెళ్లి వచ్చిన 54 మందికి పరీక్షలు చేయగా... 38 మందికి నెగిటివ్ వచ్చింది. అలాగే దిల్లీ యాత్రికుల బంధువులు, స్నేహితులను గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 15 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 244 అనుమానిత కేసుల వివరాలు రావాల్సి ఉంది. జిల్లాలో 4,821 మంది విదేశాల నుంచి రాగా.... 2,918మంది గృహ నిర్బంధం పూర్తి చేసుకున్నారు. మరో 19,00ల మందికి పైగా గృహనిర్బంధంలో ఉన్నారు.