Corona Booster Dose : 18 ఏళ్ల వయసు పైబడిన వారికి కొవిడ్ ముందస్తు నివారణ(బూస్టర్) డోసును ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రులకే పరిమితం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యంలో ఎప్పుడు ఉచితంగా అందజేస్తారా? అనే చర్చ నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ వైద్యంలోనే అత్యధిక డోసుల టీకాలను పంపిణీ చేశారు. ఆదివారం (10న) సాయంత్రం వరకూ గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రం మొత్తమ్మీద 6,15,99,105 టీకా డోసులను పంపిణీ చేయగా.. ఇందులో ప్రభుత్వ వైద్యంలో 5,74,38,606 డోసులు కాగా.. ప్రైవేటులో కేవలం 41,60,499 డోసులు మాత్రమే పంపిణీ చేశారు.
Corona Booster Dose : ప్రభుత్వ ఆసుపత్రుల్లో బూస్టర్ ఎప్పుడు? - ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా బూస్టర్ డోస్
Corona Booster Dose : 18 ఏళ్ల వయసు పైబడిన వారికి బూస్టర్ డోస్‌ను ప్రస్తుతానికి ప్రైవేట్ ఆసుపత్రులకే పరిమితం చేసింది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్ వైద్యంలో ఎప్పుడు ఉచితంగా అందజేస్తారా అనే చర్చ నెలకొంది. కరోనా మరో కొత్త వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిన దృష్ట్యా అందరూ బూస్టర్ డోస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితం చేయడంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Corona Booster Dose in Telangana :ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారిలో అర్హులు రెండు డోసులు 100 శాతం మంది స్వీకరించారు కూడా. అయితే 60 ఏళ్లు దాటిన వారికే ముందస్తు నివారణ డోసును ప్రభుత్వ వైద్యంలో పంపిణీ చేస్తుండడంతో.. 18-59 ఏళ్ల మధ్యవయస్కుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రైవేటులో ఒక్కో డోసుకు రూ.225గా నిర్ణయించారు. దీనికి అదనంగా నిర్వహణ రుసుమును గరిష్ఠంగా రూ.150 వరకూ స్వీకరించవచ్చని సూచించారు. దీంతో ప్రైవేటు వైద్యంలో బూస్టర్ డోసు పొందాలంటే.. రూ.375 చెల్లించాల్సి వస్తుంది. పైగా ఇప్పుడు కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ఎక్కువ ప్రైవేటు ఆసుపత్రులు టీకాల నిల్వలను కొనసాగించడం లేదు. అదే ప్రభుత్వ వైద్యంలో ఆదివారం నాటికి కొవిషీల్డ్ టీకా డోసులు 11,64,210 ఉండగా.. కొవాగ్జిన్ డోసులు 16,01,455.. కొర్బెవాక్స్ డోసులు 14,18,720 చొప్పున నిల్వ ఉన్నాయి. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారు 106 శాతం తొలి డోసును, 100 శాతం రెండో డోసును స్వీకరించారు. అయినా రెండో డోసు పొందాల్సిన వారు ఇంకా కొన్ని జిల్లాల్లో ఉన్నారు. టీకాల నిల్వలు సమృద్ధిగానే ఉండడంతో.. 18 ఏళ్లు దాటిన వారందరికి బూస్టర్ డోసును ఇవ్వడం వల్ల మేలు జరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ వైద్యంలో వెంటనే అమలుపర్చాలని సూచిస్తున్నారు.