రాష్ట్రంలో మున్సిపల్ మున్సిపల్ ఎన్నికల వేడి తగ్గకముందే... సహకార ఎన్నికల సందడి మొదలైంది. 905 సంఘాల్లోని 12,100 డైరెక్టర్ పదవులకు నామపత్రాల సమర్పణ గడువు ముగిసింది. చివరి రోజున అభ్యర్థులు పెద్ద ఎత్తున్న నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఓటరు జాబితాలు విడుదల చేసిన అధికారులు.. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వివిధ కారణాలతో ఓటరు జాబితా నుంచి తొలగించిన రైతుల పేర్లు, ఓటరు జాబితాను ఆయా సంఘాల నోటీసు బోర్డులో... సహకారశాఖ ఎన్నికల అథారిటీ ప్రదర్శించింది.
ఎన్నికల నిర్వహణపై సమీక్ష..
ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా సహకార అధికారులతో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి, సహకారశాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య సమీక్షించారు. ఒక్కో పరపతి సంఘంలో... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ ప్రకారం డైరెక్టర్ పదవులు కేటాయించారు. ఛైర్మన్ పదవికి మాత్రం రిజర్వేషన్ వర్తించదని సహకార శాఖ స్పష్టం చేసింది. ఎన్నికలు పూర్తిగా రాజకీయాలకు అతీతంగా జరగాల్సి ఉన్నా... రాజకీయ పార్టీల జోక్యం పెరిగింది.
సహకార శాఖ నియమావళి ప్రకారం... అభ్యర్థి రెండు సెట్లకు మించి నామపత్రాలు దాఖలు చేయరాదు. ఒక వార్డులో నమోదైన వ్యక్తి మరో వార్డు నుంచి పోటీ చేయవచ్చు. కాకాపోతే... ప్రతిపాదించే, బలపరిచే వ్యక్తులు మాత్రం అదే వార్డులో విధిగా ఓటుహక్కు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుందని సహకార వర్గాలు తెలిపారు. నామపత్రాలు సమర్పించేప్పుడు... అభ్యర్థితో పాటే ప్రతిపాదించే, బలపరిచే వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలి.
సమానం వస్తే లాటరీ..
నామపత్రాల సమర్పణ గడువు ముగిసినందున... ఇవాళ పరిశీలన ఉంటుంది. రేపు ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు ఉంటుంది. 12,100 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... ఒక్కో కేంద్రంలో ముగ్గురు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. వెంటనే లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. ఛైర్మన్ ఎన్నిక పరోక్ష పద్ధితిలోనే కొనసాగుతోందని సహకారశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలో 'సహకార' సందడి.. జోరుగా పార్టీల జోక్యం ఇదీ చూడండి:ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతర