వేలకు వేల రూపాయలు పెట్టి సరకులు కొన్న వినియోగదారులకు చేతి సంచి కావాలంటే అదనంగా నగదు చెల్లించాల్సిందే. రిటైల్ సంస్థలు తమ సంస్థ పేర్లను ముద్రించి తమను ప్రచార ఏజెంటుగా వాడుకుంటున్నారని వినియోగదారులు ఆ సంస్థ నిర్వాహకులపై విరుచుకుపడుతున్నారు. షాపింగ్ మాల్‌లో, సూపర్ మార్కెట్‌లోనే ఆయా సంస్థల ప్రతినిధుల్ని నిలదీస్తున్నారు. వినకపోతే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని ఉపయోగించి వారి వద్ద వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం నేపథ్యంలో క్యారీకవర్లు.. చట్టాన్ని ఉపయోగించి వినియోగదారుల రికవర్లపై కథనం..
మున్సిపల్ అథారిటీలో జమ చేయాలి
ప్లాస్టిక్ సంచులపై నిషేధం విధించినప్పటి నుంచి కంపెనీలు డబ్బులు తీసుకుని క్యారీబ్యాగ్‌లు ఇచ్చే పద్ధతి మొదలైంది. అలా వసూలు చేసిన రుసుమును వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద మున్సిపల్ అథారిటీలో డిపాజిట్ చేయాలని వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలా వసూలు చేసిన ప్రతి రూపాయి లెక్కను వినియోగదారులకు బోర్డుల ద్వారా ప్రదర్శించాలి. ఇది నగరంలో అమలు కావడం లేదు. గ్రేటర్ పరిధిలో సుమారు 3000కు పైగా రిటైల్ సంస్థలు క్యారీ బ్యాగులపై రూ.కోట్లు వసూలు చేస్తున్నాయి. అయితే ఈ డబ్బును స్థానిక సంస్థకు జమ చేస్తున్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు.