Consumer Commission Fined Railway Manager : టికెట్ కొన్న వ్యక్తికి సీటు కేటాయింపు సమాచారం ఇవ్వకుండా అసౌకర్యం కలిగించిన రైల్వే సిబ్బంది తీరును హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 తప్పుపట్టింది. రూ.3వేల పరిహారం, కేసు ఖర్చుల కింద ఫిర్యాదీకి రూ.2వేలు చెల్లించాలని కెంపెగౌడ రైల్వే డివిజనల్ కార్యాలయం మేనేజర్‌ను ఆదేశించింది.
రిజర్వ్ చేసుకున్నా దక్కని సీటు.. రైల్వేకు కన్జ్యూమర్ కమిషన్ జరిమానా
Consumer Commission Fined Railway Manager : రైల్వే టికెట్ కొన్న వ్యక్తికి సీటు కేటాయింపు సమాచారం ఇవ్వకుండా అసౌకర్యం కలిగించిన రైల్వే సిబ్బంది తీరుపై హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఫైర్ అయింది. ప్రయాణికుడుకి పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులు తమ వాదన రుజువు చేసేలా, బలపరిచే సాక్ష్యాలు సమర్పించలేదని వ్యాఖ్యానించిన బెంచ్ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అసలేం జరిగిందంటే..
అమీర్‌పేట్‌కు చెందిన డి.దేవకుమార్‌రెడ్డి యశ్వంత్‌పూర్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం)లో టికెట్ బుక్ చేయగా.. డి-2 కోచ్‌లో 108 నంబరు సీటును కేటాయించారు. రైలు రాగానే ఆ కోచ్‌లో 100 సీట్లు మాత్రమే ఉండటంతో అయోమయానికి గురయ్యారు. సీటు దొరక్క మొత్తం ఏడున్నర గంటలు నిల్చొనే ప్రయాణించారు. ఈ నేపథ్యంలో బాధితుడు తన టికెట్ డబ్బు తిరిగి చెల్లించాలని రైల్వే సిబ్బందిని కోరగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఫిర్యాదు ఇచ్చినా తీసుకోలేదు.
ఆయన పరిహారం కోరుతూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. అనంతరం స్పందించిన రైల్వే సిబ్బంది అనివార్య కారణాల వల్ల డీ-2 కోచ్‌ను 100 సీట్లకే పరిమితం చేశామని.. టికెట్లు తీసుకున్న 9 మందికి డీ-1లో సీట్లు కేటాయిస్తూ సందేశం పంపామని తెలిపారు. ప్రతివాదులు తమ వాదన రుజువు చేసేలా, బలపరిచే సాక్ష్యాలు సమర్పించలేదని వ్యాఖ్యానించిన బెంచ్ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.