కొత్త పీఆర్సీ ప్రతిపాదనలపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ పీఆర్పీ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు పీఆర్పీ ఇవ్వాలన్నారు. కనీసం 43 శాతానికి తగ్గకుండా పీఆర్పీ ఇవ్వాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కొత్త పీఆర్పీపై కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆరోపించారు. కేవలం 7.5 శాతం ఫిట్‌మెంట్ ప్రతిపాదించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నూతన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి పీఆర్సీ ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేదు. నివేదిక రూపకల్పనపైనే అనుమానం కలుగుతోంది. శాస్త్రీయ అధ్యయనం జరిగిన దాఖలాలు లేవు. పీఆర్పీని మూడేళ్లు పెండింగ్లో పెట్టి, నివేదిక వచ్చిన తరువాత త్రిసభ్య కమిటీ పేరుతో ప్రభుత్వం నెల రోజులుగా కాలయాపన చేసింది. చావు కబురు చల్లగా చెప్పినట్లు.. 7.5 శాతం ప్రతిపాదించడం ఘోరంగా ఉంది. ఇది ఉద్యోగులను అవమానించడమే.